వీఓఏ మాధవిపై దాడి దుర్మార్గం
నిందితున్ని అరెస్టు చేయకుండా పోలీసుల నిర్లక్ష్యం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఓఏ మాధవిపై దాడికి పాల్పడిన మాజీ సర్పంచ్ భర్త అమర్‌నాథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తాలో మాధవిపై దాడికి పాల్పడిన నిందితునిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, పీకే మల్లేపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో వీఓఏగా పనిచేస్తున్న మాధవిపై అకారణంగా గ్రామ మాజీ సర్పంచ్ భర్త అమర్నాథ్ దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. అసభ్య పదజాలంతో దూషించడం, కులం పేరుతో అవమానించడం అమానుషమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ చర్య సామాజిక న్యాయం, మహిళల గౌరవం, ఉద్యోగుల హక్కులకు విరుద్ధమని చెప్పారు. వెంటనే ఆ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ , ఎస్పీ సందర్శించి, విచారణ నిర్వహించి, అమర్‌నాథ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవికి పూర్తి రక్షణ కల్పించి, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసు నమోదు చేసినా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను నిలదీశారు. నిందితుని పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి విడనాడాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ మాట్లాడు తూ రాష్ట్రవ్యాప్తంగా వీఓఏలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. అయినప్పటికీ అయినప్పటికీ ప్రజలకు సేవలంది స్తున్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరిగితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటమేంటని ప్రశ్నించారు. మాధవి పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రంలోని 18వేల మంది వీఓఏలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఘటన ఒక్క మాధవికి సంబంధించిన విషయమే కాదనీ, రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి వీఓఏకు సంబంధించిన సమస్యగా భావిస్తున్నారని చెప్పారు. దాడికి పాల్పడిన నిందితున్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగి, ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, ఎం. వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ఎస్ఆర్ఎ. ప్రసాద్, ఎ. సునీత, ఆర్. రాజు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు దశరథ్, జె. కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమర్‌నాథ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
49 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)