నవతెలంగాణ - హైదరాబాద్ : రైతులకు వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం ద్వారా రుణాలు అందిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, నీటిపారుదల వంటి అవసరాలతో పాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి కార్యకలాపాలకు కూడా ఈ రుణాలు ఉపయోగించుకోవచ్చు. KCC అనేది రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యం. బ్యాంకు రైతులకు క్రెడిట్ లిమిట్ మంజూరు చేస్తుంది. అవసరమైనప్పుడు డబ్బు తీసుకుని పంట విక్రయం తర్వాత తిరిగి చెల్లించవచ్చు. సాధారణంగా ఈ సౌకర్యం ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. రైతు సాగు విస్తీర్ణం, పంట, సాగు ఖర్చుల ఆధారంగా బ్యాంకులు రుణ పరిమితిని నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ, గడువులోపు రుణ చెల్లింపుపై ప్రోత్సాహకం వర్తిస్తే, స్వల్పకాలిక పంట రుణాలపై వడ్డీ 4 శాతానికి తగ్గే అవకాశం ఉంటుంది. సొంత భూమి రైతులతో పాటు నిబంధనలకు అనుగుణంగా కౌలు రైతులు, షేర్ క్రాపర్లు కూడా KCC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంకు ఖాతా, భూమి లేదా సాగు వివరాలతో సమీప బ్యాంకును సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు






కామెంట్‌లు (0)