Magazines

బండ్ల గణేశ్ కు భారీ ఊరట..

1 గంట క్రితం

Bandla-Ganesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు సంబంధించిన రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసు వివాదం సుఖాంతమైంది. తమ మధ్య ఉన్న వివాదం పూర్తిగా సమసిపోయిందని ఈ కేసులో ఫిర్యాదుదారుడైన జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ వివరాలను పంచుకున్నారు.

కేసు వివరాల్లోకి వెళితే... గతంలో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ. 95 లక్షలు తీసుకున్నారు. జానకిరామయ్య మరణం తర్వాత ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వరరావుకు బండ్ల గణేశ్ తన పరమేశ్వర ఆర్ట్స్ పేరిట చెక్ ఇచ్చారు. అయితే ఖాతాలో తగినంత నగదు లేక ఆ చెక్ బౌన్స్ కావడంతో వెంకటేశ్వరరావు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఒంగోలు న్యాయస్థానం బండ్ల గణేశ్ ను దోషిగా తేలుస్తూ ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా, బాధితుడి కోర్టు ఖర్చులు చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఈ తీర్పు అనంతరం జెట్టి వెంకటేశ్వరరావు తాజాగా వీడియో విడుదల చేస్తూ కీలక విషయాలు వెల్లడించారు. "తమ మధ్య ఉన్న చిన్నపాటి వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కావాలనే అపార్థాలు సృష్టించి, లేనిపోని తప్పుడు ప్రచారం చేశారు" అని ఆయన పేర్కొన్నారు. గతంలో తమ కుమారుడు, బండ్ల గణేశ్ ఎంతో స్నేహంగా ఉండేవారని... కుమారుడి మరణం తర్వాత ఇగో కారణంగానో లేదా మధ్యవర్తుల ప్రమేయం వల్లనో చిన్నపాటి మనస్పర్థలు వచ్చి కోర్టు కేసుల వరకు దారితీశాయని వివరించారు.

ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య విభేదాలు తొలగిపోయాయని, బండ్ల గణేశ్ తో తన స్నేహం, అనుబంధం గతంలో లాగే కొనసాగుతాయని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ చెక్ బౌన్స్ వివాదానికి తెరపడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్