- శివనామ స్మరణతో మారుమోగిన నీలకంఠేశ్వర ఆలయాలల
నవతెలంగాణ-సత్తుపల్లి
పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన దీపారాధన చేసి, ఉపవాస దీక్షలు ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు రోడ్డులో గల శ్రీ దుర్గా పార్వతీ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, కుంకుమార్చనలు జరిపించారు. సాయంత్రం జ్వాలా తోరణం కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పట్టణంలోని విరాట్ నగర్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, వెంగళరావునగర్ శివాలయంలోనూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మండల పరిధిలోని కాకర్లపల్లి, సదాశివునిపాలెం, బుగ్గపాడు, బేతుపల్లి, గంగారం, తుంబూరు తదితర గ్రామాల్లోని శివాలయాల్లోనూ కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరిపారు.
మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలను వెలిగించి, విశేష పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.






కామెంట్లు (0)