‘‘రేవంతుద్దీన్ కాదు.. అబద్ధాలుద్దీన్’’
కాంగ్రెస్ ప్రభుత్వం, కేటీఆర్‌పై విమర్శలు..
రైతులు, విద్యార్థులు, కార్మికులు, జర్నలిస్టుల సమస్యలపై గళం..
తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత..
నవతెలంగాణ–వేములవాడ
వేములవాడ వేదికగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు, విద్యార్థులు, మెడికోలు, బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికులు, చేనేత కార్మికులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీశారు. రాజన్న ఆలయ అభివృద్ధి, కోడెల సంరక్షణ, సిరిసిల్ల సెస్, సాగునీటి ప్రాజెక్టులు, నేరళ్ల బాధితులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతకుముందు శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని కోడె మొక్కు చెల్లించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సుమారు రూ.250 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, ఈ నిధులతో కాంక్రీట్ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆలయ చారిత్రక వైభవం, ఆగమశాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా కృష్ణశిలతో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. శిల్పులు, ఆగమశాస్త్ర నిపుణుల సూచనలతో తరతరాలు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాజన్న ఆలయానికి భక్తులు నిష్ఠతో సమర్పించే కోడెల సంరక్షణపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కోడెలకు సరైన పశుగ్రాసం, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుతున్నాయా అని ప్రశ్నించారు. కోడెలు మృతిచెందిన అనంతరం కూడా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ఈ అంశంపై ఎంపీ బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయనీ, రాజన్న చెరువు దుర్గంధంతో నిండిపోయిందని, ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి రాజన్న చెరువు ప్రక్షాళన చేపట్టడంతో పాటు పట్టణానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ.5 కోట్లతో నిర్మించిన మార్కెట్లను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
‘కొనుగోలు చేస్తారో.. అడుక్కుంటారో తెలియదు.. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై ఎంపీ బండి సంజయ్ నోరు విప్పాలని కోరారు. మిడ్‌మానేరు–అప్పర్‌మానేరు నర్మాల లింక్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. లక్షా పది వేల ఎకరాలకు సాగునీరు అందే వరకు తాము నిద్రపోమని అన్నారు. అవసరమైతే పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేపట్టి ప్రజల్లోకి వెళ్తామని హెచ్చరించారు.
రుద్రంగి రిజర్వాయర్ పనుల్లో 2018 నుంచి ఇప్పటికీ పురోగతి లేదని పేర్కొన్నారు. కాలువల పనులు పూర్తయితే సుమారు 63 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ధూమ్‌పేట వద్ద వరద కాలువ నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి, సనుగులలోని పటేల్ చెరువు, ఎర్రకుంట చెరువులను అనుసంధానిస్తూ 0.5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తే వేములవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాల పరిధిలోని భూములకు సాగునీరు అందించవచ్చని సూచించారు.
‘‘ముఖ్యమంత్రి సభలో తిట్లు తప్ప చేసిందేమీ లేదు’’
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగాలపై కవిత విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి సభలో తిట్లు తప్ప సిరిసిల్లకు నయాపైసా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదేళ్లు మంత్రులుగా ఉన్నవారు నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. కేటీఆర్‌ను ‘యువ సామ్రాట్’గా చెప్పుకునే పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గంలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్‌ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ల్యాబ్‌లు లేక విద్యార్థులు జగిత్యాల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.
సిరిసిల్ల మెడికల్ కాలేజీలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని కవిత ఆరోపించారు.
బీడీ కార్మికుల ఈఎస్ఐ ఆస్పత్రి ఏమైంది?
బీడీ కార్మికులకు కేటాయించిన 15 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం ఏమైందని కవిత ప్రశ్నించారు. కార్మికుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్)ను ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని కవిత ఆరోపించారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినా 24 గంటల్లో సేవలు అందించే వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ పోతే పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు.
‘‘రేవంతుద్దీన్ కాదు.. అబద్ధాలుద్దీన్’’
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌పై కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రేవంత్‌రెడ్డి–మహేష్‌గౌడ్‌ల జోడీ సూపర్‌హిట్ కాదు.. ఒకరి వీపుపై ఒకరు గుద్దుకునే జోడీ’’ అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లో ఒకరు తానే ముఖ్యమంత్రి అంటుంటే, మరొకరు బీసీ ముఖ్యమంత్రి అంటున్నారని, అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ‘‘రేవంతుద్దీన్ కాదు.. అబద్ధాలుద్దీన్ అని పేరు మార్చుకోవాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి సమస్యకూ ఓ కమిటీ వేసి చేతులు దులుపుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని విమర్శించారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఉర్దూ మీడియా విలేకరులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. మండలానికి ఒక్కరికే అక్రిడిటేషన్ ఇవ్వడం ఏమిటని నిలదీశారు.
వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ తెలంగాణ రక్షణ సేన ప్రధాన రాజకీయ పార్టీలకు పోటీ ఇస్తుందని ప్రకటించారు.ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందనీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు తమకు మద్దతుగా నిలవాలని కవిత కోరారు. రైతులు, విద్యార్థులు, కార్మికులు, గల్ఫ్ బాధితులు, జర్నలిస్టులు, రాజన్న భక్తుల సమస్యలపై అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు సంకపల్లి సుమలత శర్మ, సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి అబ్దుల్ మజీద్, జిల్లా నాయకులుమల్లేష్ యాదవ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు, తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)