- సత్తుపల్లి సీడీపీఓ సత్యవతి
నవతెలంగాణ-సత్తుపల్లి
గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని సత్తుపల్లి ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి పిలుపునిచ్చారు.
9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా అయ్యగారిపేట-6 అంగన్వాడీ సెంటర్‌లో సెక్టార్ సూపర్‌వైజర్ రజని సూచనల మేరకు అంగన్వాడీ టీచర్ విజయమ్మ ఆధ్వర్యంలో మంగళవారం పోషకాహార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సత్యవతి పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహార ప్రాముఖ్యతను ఆమె వివరించారు.
మున్సిపల్ కౌన్సిలర్ మట్టా దేవజ్యోతి మాట్లాడుతూ... గర్భిణులు తగిన ఆహారంతో పాటు సకాలంలో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని ఆమె స్పష్టం చేశారు. సెక్టార్ సూపర్‌వైజర్ రజని మాట్లాడుతూ... 3 నుంచి 6 ఏళ్ల పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని కోరారు. చిన్నారులకు ప్రాథమిక విద్య, సరైన పోషకాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు సంప్రదాయబద్ధంగా సీమంతాల వేడుకను నిర్వహించారు. మూడేళ్లు నిండిన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయమ్మ, వెంకటమ్మ, ఉష, సత్యవతి, వివిధ అంగన్వాడీ కేంద్రాల ఆయాలు, చిన్నారుల తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)