- గిరిజన యువతులకు స్వయం ఉపాధి దిశగా అడుగులు
- శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువీకరణ పత్రాలు, కుట్టు మిషన్ సామగ్రి అందజేత
- శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు
- వైటీసీ మేనేజర్ అజిత్
నవతెలంగాణ - అశ్వారావుపేట
గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ) ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తొలి బ్యాచ్‌కు చెందిన అభ్యర్థులు టైలరింగ్ శిక్షణను శనివారం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
ఈ ఏడాది జూలై 22 న అశ్వారావుపేటలోని గిరిజన భవనంలో ఐటీడీఏ నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్యూటీషియన్, టైలరింగ్, డీడీఈఓ, సీపీఏ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు.
ప్రతి కోర్సుకు 35 మంది చొప్పున మూడు బ్యాచ్‌లుగా శిక్షణ ఇస్తున్నట్లు వైటీసీ మేనేజర్ అజిత్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలతో పాటు కుట్టు మిషన్ సామగ్రిని అందజేసినట్లు పేర్కొన్నారు.
ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు:
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కృషి, ఐటీడీఏ పీవో రాహుల్ చొరవ, జేడీఎం హరికృష్ణ పర్యవేక్షణలో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అజిత్ తెలిపారు. టైలరింగ్ శిక్షణ పూర్తి చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి ఆసక్తి చూపే అభ్యర్థులకు చెన్నైలోని బెస్ట్ గార్మెంట్స్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
మరో రెండు కోర్సులు ప్రారంభిస్తాం:
యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించేందుకు మరో రెండు కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు హెచ్ఓడీ కారం వినోద్‌కుమార్ తెలిపారు. వీటిలో కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించిన కోర్సు కూడా ఉంటుందని పేర్కొన్నారు.
కుట్టు శిక్షణతో ఆర్థిక స్వావలంబన:
టైలరింగ్ శిక్షణతో స్వయం ఉపాధి పొందే అవకాశం లభించిందని శిక్షణ పూర్తి చేసుకున్న అనిత తెలిపారు. కుటుంబ అవసరాలకు దుస్తులు కుట్టడంతో పాటు గ్రామంలోని ఇతరులకు కూడా కుట్టుపని చేసి ఆదాయం సంపాదించవచ్చని, తద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తీరిక సమయాల్లో కుట్టుపనిని చేతివృత్తిగా కొనసాగిస్తూ స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నట్లు మరో శిక్షణార్థిని ప్రియాంక తెలిపారు.







కామెంట్లు (0)