- ఈ యేడాదంతా విపత్కర పరిస్థితులే
- నీటిని పొదుపుగా వాడుకోవాలి
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
పసిఫిక్ మహాసముద్రం సలసల కాగుతోందని, ఈశాన్య, నైరుతి రుతుపవనాలను, తుఫాన్లు వాయుగుండాలను సైతం పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై వెదజల్లుతున్న వేడి అడ్డుపడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా 50 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని, ఈ విపత్కర పరిస్థితుల్లో బతికి బట్ట కట్టడం కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం సత్తుపల్లి వచ్చిన మంత్రి తుమ్మల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.
ఈ యేడాదంతా విపత్కర పరిస్థితిలే
ఈ యేడాదంతా తీవ్రమైన విపత్కర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఏడాది వరకు సాధారణ వర్షాలు పడే పరిస్థితి లేదని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా రైతులు వరి పంట సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులందరూ ఆరుతడి పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పశువులను కాపాడుకోవాలని, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. కేవలం తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసి నష్టాలను నివారించుకోవాలన్నారు.
ప్రభుత్వ సూచనలను పాటిస్తూ, సామూహిక ప్రయత్నాలతో ఈ విపత్కర పరిస్థితి నుంచి సురక్షితంగా బయటపడదామని మంత్రి తుమ్మల అన్నారు. భవిష్యత్తులో సాగునీరు మాట దేవుడెరుగు, కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. వ్యవసాయం దెబ్బతిని ధాన్యం ఉత్పత్తి తగ్గితే బియ్యం ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందన్నారు. ధాన్యం వ్యాపారులు పంట కోయక రాకముందే అడ్వాన్స్ ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారన్నారు. రాబోయే కాలంలో కరెంటు ఉండదని, నీళ్లు రావని, కనీసం తిండి దొరకడం కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని తుమ్మల హెచ్చరించారు. అటువంటి క్లిష్ట సమయంలో కరెంటు లేదని, నీళ్లు రావడం లేదని ఎవరిని నిందించినా ప్రయోజనం ఉండదన్నారు. ఈ నేపద్యంలో ప్రతి ఒక్కరూ సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్తు వైపు అడుగులు వేయాలని తుమ్మల సూచించారు. సత్తుపల్లిని మోడల్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ లు ఏర్పాటు అయ్యేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ను కోరారు.
వచ్చే నెలాఖరు నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు
రానున్న నవంబర్ నెలాఖరు నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు వచ్చి తీరతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టులో అంతర్భాగమైన యాతాలకుంట టన్నెల్ పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తి కానుందని మంత్రి తుమ్మల తెలిపారు. టన్నెల్ పనులు పూర్తిగా కాలువ రివిట్మెంట్ పనులను పూర్తి చేసి గోదావరి నీళ్లను సత్తుపల్లిలోని వేశ్యకాంతల చెరువులో కుమ్మరిస్తానని మంత్రి తుమ్మల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)