- ఆదివారం సైతం తప్పని వాహనదారుల ఇబ్బందులు
- రోడ్డుపై ఆగుతున్న ఆటోలతో రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలో ఉన్న కిషన్ షాపింగ్ మాల్ ఎదుట ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోందని వాహనదారులు, పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. షాపింగ్ మాల్ ఎదుట రోడ్డుపై ఆటోలు నిలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. ఆదివారం సెలవు రోజున సైతం ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై ఆటోలు నిలపకుండా నియంత్రించాల్సిన ట్రాఫిక్ పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ తదితర వాటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించే పోలీసులు, ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తున్న వాహనాల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కిషన్ షాపింగ్ మాల్ ఎదుట ఆటోలు ఇష్టానుసారంగా నిలపకుండా నియంత్రించాలని, ట్రాఫిక్ పోలీసులను నిరంతరం అందుబాటులో ఉంచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.





కామెంట్లు (0)