- 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి: ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు
నవతెలంగాణ-సత్తుపల్లి
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను శనివారం జేవీఆర్-ఓసీలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సముద్రాల సుధాకర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ... కార్మికుల హక్కుల పోరాటాలకు, సంక్షేమానికి ఏఐటీయూసీ స్ఫూర్తిదాయకమన్నారు. సత్తుపల్లి రింగ్ సెంటర్లో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జెండాను జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నిమ్మటూరి రామకృష్ణ ఆవిష్కరించారు. సిద్దారం రోడ్డు ఆటో ఓనర్ అండ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణను ఆ సంఘ అధ్యక్షుడు కృష్ణ ఎగురవేశారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ రింగ్ సెంటర్లో కేక్ కట్ చేసి కార్మికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యానికి ముందే ఏర్పడి, కార్మికుల కోసం అనేక చట్టాలను, సంక్షేమ పథకాలను సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా ఉన్నాయని మండిపడ్డారు. త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మార్చి, మళ్లీ 12 గంటల పని విధానాన్ని తేవడానికే వీటిని తీసుకొచ్చారని ఆరోపించారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఈ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని దండు, నిమ్మటూరి డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రాయితీలను వెనక్కి తీసుకొని, ఆ నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి బసవయ్య, తెలగారపు రామారావు, నాయకులు దారా భీమయ్య, సూర్యప్రకాశ్, జేవీఆర్-ఓసీ ఫిట్ సెక్రెటరీ నరసింహారావు, బుగ్గ సుధాకర్, ఉపేంద్రచారి, సుబ్రమణ్యం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ రహ్మతుల్లా, సత్తార్, వల్లూరు శీను, కంచి శ్రీనివాసరావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కాశీరావు, వెంకట్, ప్రసాద్ సింగ్, పుల్లయ్య, వినయ్, రమేష్ పాల్గొన్నారు.







కామెంట్లు (0)