నవతెలంగాణ-ఆలేరు టౌను
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం వ్యాపార లబ్దికి, ఏపీ సీఎం చంద్రబాబు మెప్పు కొరకు, తెలంగాణ చెందాల్సిన నీటి వనరులను, ఆంధ్రకు బహిరంగంగానే తరలిస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో కేసిఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులను వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఖండిస్తూ.. ఆలేరు పట్టణంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టుడు సరికాదనీ, వివాదాస్పద వ్యాఖ్యలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసభ్య పదజాలాన్ని వాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఆయనకు ఆయనే చెడ్డపేరు కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకనుంచైన సీఎం కుర్చీకి తగినట్టుగా హుందాగా వ్యవహరించాలని ఉధ్భోదించారు.
కరెంటు కోతలు, సాగునీటి కష్టాలు, రైతుల కన్నీళ్లు, 22ఏ భూముల లాంటి సమస్యలు సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పరిష్కరించకుండా ప్రభుత్వ సొమ్మును ఢిల్లీపెద్దలకు, ఎనుముల సోదరులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల హామీలను అమలు చేయాలని గట్టిగా నిలదీస్తుంటే.. జవాబు చెప్పలేక, హామీలను అమలు చేయలేక సభలు పెట్టిమరీ బూతు పురానాలతో రెచ్చిపోయి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్రెడ్డి మాట్లాడే భాష, వ్యాఖ్యలపైనే మేధావులు చర్చించే పరిస్థితి రావడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. వెంటనే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ , గంగుల శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, యాట శివ, బీజాని కళ్యాణి మధు, గిరిరాజు వెంకటయ్య, రచ్చ రాంనర్సయ్య,మొరిగాడి అశోక్, మల్లేష్, పూల శ్రావణ్ , ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)