జీతాలు చెల్లించకుంటే కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ
నవతెలంగాణ – నాచారం
నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు గురువారం విధులు నిలిపివేసి సమ్మె నిర్వహించారు. కార్మికులకు వేతనాలు చెల్లించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నప్పటికీ, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో మాత్రం ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ నెల రోజుల క్రితమే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు.
అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 13న గంటపాటు నిరసన ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు జీతాలు చెల్లిస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. కార్మికుల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ కార్యదర్శి సత్యప్రసాద్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుకుమార్ పాల్గొని కార్మికుల ఆందోళనకు మద్దతుగా ప్రసంగించారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాస్కరాచారి, నర్సింగ్‌రావు, వేణుమాధవ్, నిరంకారీ, నీలిమ, నర్సింహ, రాజేష్, రాజకుమార్ చారి, అశోక్, సమద్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)