- అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ఖేత్ బచావో అభియాన్
- రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు
- సమతుల్య ఎరువుల వినియోగం.. సుస్థిర వ్యవసాయంపై దృష్టి
నవతెలంగాణ - అశ్వారావుపేట
నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ స్థాయి ‘ఖేత్ బచావో అభియాన్’ను తెలంగాణలో ఈ నెల 22 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించనున్నారు. వ్యవసాయాన్ని పర్యావరణహితంగా మార్చడంతోపాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీరు, భూసారాన్ని పరిరక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది.
భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం
భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను సమతుల్యంగా వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల సాగుతో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించనున్నారు. వరి కోతల అనంతరం ఖాళీగా ఉండే భూములను సమర్థంగా వినియోగించుకోవడం, పంట అవశేషాలను సక్రమంగా నిర్వహించడం, వాటిని తగులబెట్టకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించేలా సూచనలు ఇవ్వనున్నారు. సేంద్రియ, జీవ ఉత్పత్తుల వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణతోపాటు క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
నీటి సంరక్షణకు ప్రాధాన్యం
వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' కార్యక్రమంతోపాటు సమగ్ర పోషక యాజమాన్యం (ఐఎన్ఎం), సమగ్ర సస్యరక్షణ (ఐపీఎం/సీపీఎం) పద్ధతులు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలను ప్రోత్సహించనున్నారు. భూసార కార్డుల వినియోగం, ఎరువుల విక్రయాలకు సంబంధించిన నిబంధనలపైనా అవగాహన కల్పించనున్నారు.
ప్రతి బ్లాక్లో 30 కార్యక్రమాలు
ఈ అభియాన్ అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఉద్యాన శాఖ, ఆత్మ, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి బ్లాక్లో సహాయ వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
జిల్లా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సలహాలతో జిల్లా స్థాయి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించి అవసరమైన సమాచార సామగ్రిని సిద్ధం చేస్తారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి బ్లాక్లో కనీసం 30 అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో కార్యక్రమంలో 50 నుంచి 100 మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించేందుకు రోజువారీ నివేదికలు, ఛాయాచిత్రాలు, ఇతర వివరాలను వ్యవసాయ శాఖ సేకరించనుంది.







కామెంట్లు (0)