Magazines

ప్రమాదభరితంగా సీసీరోడ్ల అంచులు

1 గంట క్రితం

Cc roads
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎస్‌డీఎఫ్‌, పంచాయతీరాజ్‌శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో కాట్రాక్టర్లు సీసీ రోడ్లు వేస్తున్నారు కానీ ఆ రోడ్లకు ఇరువైపులా(రోడ్డు సైడ్‌ బర్ములకు) మొరం మట్టి పోయక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లపై భారీ వాహనాలు వెళ్ళినప్పడు రోడ్లు పాక్ష‍ికంగా దెబ్బతింటున్నాయి. అదేవిధంగా రోడ్డుకిరువైపులా బర్ములకు మట్టిపోయకపోవడంతో సీసీరోడ్డుకు, నేలమట్టానికి దాదాపుగా పది అంగులాల వ్యత్యాసం కనబడుతోంది. దీంతో నిత్యం రోడ్డుపై వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్ల నిర్మాణాలు పూర్తై నెలలు గడుస్తున్నా.. అధికారులు, కాంట్రాక్టర్లు కనీసం పట్టించుకోకపోవడంపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే రోడ్డు, కనీస లైటింగ్ లేని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఈ అంచులు కనిపించక వాహనదారులు కిందపడి గాయాల పాలవుతున్నారు. మండల పరిధిలోని వాడియాల గ్రామంలో కూడా సీసీరోడ్డు వేసి నెలలు గడుస్తున్నా రోడ్డుకిరువైపులా మట్టిపోయుటకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే సీసీ రోడ్ల అంచుల వెంట మట్టి పోయించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మిడ్జిల్ మండల ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్