- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి
- సత్తుపల్లిలో మహాసభల ప్రచార ఫ్లెక్సీల ఆవిష్కరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈనెల 15 నుంచి 18వ వరకు నల్లగొండలో నిర్వహించనున్న తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి పిలుపునిచ్చారు. మహాసభల ప్రాధాన్యతను వివరిస్తూ సత్తుపల్లి పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాచర్ల భారతి మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి, వారి హక్కుల సాధన కోసం భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించేందుకు ఈ జాతీయ మహాసభలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి పరిరక్షించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి రైతులందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సత్తుపల్లి పట్టణ, మండల ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ మహాసభలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని భారతి కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘ డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు శీలం కరుణ, నాయకులు చావా రమేష్, భాస్కర్, మాచర్ల గోపాల్ పాల్గొన్నారు.







కామెంట్లు (0)