-వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్
నవతెలంగాణ-సత్తుపల్లి
నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగే అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో మహాసభల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ అయిన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ మహాసభలు చారిత్రాత్మకమైనవని ఆయన తెలిపారు. మహాసభల తొలిరోజైన నవంబర్ 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
రైతాంగ హక్కులు, వ్యవసాయ రంగ రక్షణ కోసం దేశవ్యాప్తంగా సాగిన సమరశీల ఉద్యమాల్లో ఏఐకేఎస్ ముందుపీఠిన నిలిచిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలల పాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమంలో కిసాన్ సభ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన డిమాండ్లను శ్రీనివాస్ లేవనెత్తారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలన్నారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలపై రైతులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అప్పుల ఊబిలో ఉన్న రైతులకు ఏకకాలంలో పూర్తి రుణమాఫీ చేసి, నూతన రుణాలు అందించాలని కోరారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ తో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు తక్షణమే పంట బీమా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతాంగ వ్యతిరేక విధానాలపై చర్చించి, భావి ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బాల బుచ్చయ్య, నాయకులు కంఠం రామకృష్ణ, మన్నేని భాస్కరరావు, ఓబిళ్ళనేని రామారావు, అయినంపూడి సనందనరావు, కొలికపోగు జగపతిరావు, సాదు పున్నమయ్య, బాల నరసమ్మ, తల్లిబోయిన వెంకటేశ్వరమ్మ, బాల లక్ష్మి పాల్గొన్నారు.







కామెంట్లు (0)