- డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల అనంతరం పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. వర్షాలు తగ్గిన నేపథ్యంలో నిల్వ నీరు, చెత్తాచెదారం కారణంగా దోమలు పెరిగి డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
మున్సిపల్ చైర్మన్ జుపల్లి శశికళ, వైస్ చైర్మన్ జుపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించడంతో పాటు వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిసరాల శుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
శానిటేషన్ ఇన్చార్జిలు శ్రీకాంత్, ప్రవీణ్ సమన్వయంతో పారిశుద్ధ్య సిబ్బంది వివిధ వార్డుల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షాల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.




కామెంట్లు (0)