నవతెలంగాణ–అశ్వారావుపేట
చిన్ననాటి స్నేహాన్ని మరువకుండా, ఆపదలో ఉన్న తోటి మిత్రుల కుటుంబాలకు అండగా నిలుస్తూ అశ్వారావుపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్‌ఎస్‌సీ–2005 బ్యాచ్ మిత్రులు తమ ఐక్యతను,వారి ఉదారతనన చాటుకున్నారు. అశ్వారావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 2005 లో పదో తరగతి చదివిన మిత్రులు ఇటీవల మృతి చెందిన తమ సహచరుడు కేబుల్ ప్రసాద్ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించేందుకు ముందుకొచ్చారు. బ్యాచ్ మిత్రులంతా కలిసి రూ.55,700 లు సేకరించారు. ఇందులో రూ.50 వేల నగదును ప్రసాద్ భార్య ఆంటోనీకి అందజేశారు. మిగిలిన రూ.5,700ను మృతి చెందిన తమ క్లాస్‌మేట్ మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్స కోసం కేటాయించారు. చిన్ననాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ, కష్టసమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తున్న ఎస్‌ఎస్‌సీ–2005 బ్యాచ్ మిత్రుల సేవాభావాన్ని పలువురు అభినందిస్తున్నారు. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు మరింత ఆర్థిక సహాయం అవసరమని, ఆ చిన్నారిని ఆదుకునేందుకు తోటి స్నేహితులు, దాతలు ముందుకు రావాలని బ్యాచ్ మిత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ షఫీ, షేక్ ఇమ్రాన్, బేతి రాజశేఖర్, నర్లపాటి రవిబాబు, తగరం మీనా, బండి వెంకటలక్ష్మి, బండి జ్యోతి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)