నవతెలంగాణ–మల్హర్రావు: ఆరుగాలం కష్టపడి, వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో కోతులు, అడవిపందుల బెడదతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పగటిపూట కోతులు, రాత్రిపూట అడవిపందులు పంటలను ధ్వంసం చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
మల్హర్రావు మండలంలో 3,600 ఎకరాల్లో పత్తి, 14,700 ఎకరాల్లో వరి సాగు చేశారు. తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, గాదంపల్లి, కిషన్రావుపల్లి, కాపురం, నాచారం, మల్లంపల్లి, అన్సాన్పల్లి, రుద్రారం, శాత్రాజ్పల్లి, కొయ్యూరు, ఎడ్లపల్లి, కొండంపేట, వల్లెంకుంట తదితర గ్రామాల్లో పత్తి పూత, కాత, కాయ దశల్లో ఉండగా, వరి పొట్ట, గొలుసు, కోత దశల్లో ఉంది. ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ పంటలను సాగు చేస్తున్న రైతులకు వన్యప్రాణుల బెడద మరింత భారంగా మారింది. కోతులు, అడవిపందులు పంటలను ధ్వంసం చేయడంతో వరి కంకుల నుంచి గింజలు రాలిపోతుండగా, పత్తి కాయలు దెబ్బతింటున్నాయి.
కనీసం పెట్టుబడులైనా చేతికొచ్చి అప్పులు తీర్చుకోవచ్చని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. అధికారులు తక్షణమే స్పందించి కోతులు, అడవిపందుల బెడదను నివారించి పంటలను రక్షించాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే దిగుబడులు తగ్గి, అప్పుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





కామెంట్లు (0)