Magazines

ప్రభుత్వ భూములకు మోక్షం లభించేనా?

1 గంట క్రితం

lands be saved
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం

రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష..
లక్ష్మీపురం 371, 359 సర్వే నంబర్లపై చర్యలుంటాయా?

ఎమ్మెల్యే గతంలో చేసిన ఫిర్యాదు విచారణ ఏమైంది?

నవతెలంగాణ – పరకాల

ప్రభుత్వ భూముల పరిరక్షణ, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కరించాలని సూచించారు. అయితే పరకాల రెవెన్యూ పరిధిలో గతంలో వెలుగుచూసిన భూ ఆక్రమణల ఆరోపణలు, అధికారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది.


గురువారం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని, భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనల ప్రకారం పరిష్కరించడంతో పాటు దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

లక్ష్మీపురం భూములపై చర్యలుంటాయా?

పరకాల మండలం లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని 371, 359 సర్వే నంబర్లలోని భూములు ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖకు చెందిన ఓ కీలక అధికారి పాత్ర ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూ రీ సర్వేలో సదరు సర్వే నంబర్లపై ప్రత్యేక విచారణ జరిపి భూముల హద్దులు, రికార్డులు, అనుభవదారుల వివరాలను పరిశీలిస్తారా? ఆక్రమణలు నిర్ధారణ అయితే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటారా? అన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

నెలలు గడిచినా తేలని విచారణ!

మరోవైపు కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు భూముల వ్యవహారంలో ప్రస్తుత తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మూడు, నాలుగు నెలల క్రితమే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆ విచారణలో ఇప్పటివరకు ఏం తేలింది? నివేదిక సిద్ధమైందా? తదుపరి చర్యలు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేదు. ఎమ్మెల్యే స్థాయిలో ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ పురోగతి వెల్లడికాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆదేశాలు కార్యరూపం దాల్చేనా?

ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల ఆరోపణలపై విచారణ, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. సమీక్ష సమావేశాల్లో ఇచ్చే ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలై ఫలితాలు చూపాలని అభిప్రాయపడుతున్నారు. మరి తాజా సమీక్షతో లక్ష్మీపురం 371, 359 సర్వే నంబర్ల భూముల వ్యవహారంపై విచారణకు మార్గం సుగమమవుతుందా? గతంలో ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుపై విచారణ పూర్తవుతుందా? ప్రభుత్వ భూములకు మోక్షం లభిస్తుందా? అన్నది వేచి చూడాలి. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్