అదానీ సంస్థ రూ.50 కోట్ల పరువునష్టం దావా
జనవరి 31 వరకు వీడియో ప్రచారం, షేరింగ్‌పై నిషేధం
కోల్‌కతా: ప్రధాని మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య ఉన్నట్టు ఆరోపిస్తున్న సన్నిహిత సంబంధాలపై రూపొందించిన డాక్యుమెంటరీ వీడియో ప్రచారం, అప్‌లోడ్, షేరింగ్‌ను కలకత్తా హైకోర్టు జనవరి 31 వరకు నిలిపివేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేయడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. సబీర్ భాటియా తదితరులు ఈ వీడియోను ప్రచారం చేయకుండా ఆపాలని సంస్థ కోర్టును కోరింది. ‘ది ఫ్రెండ్‌షిప్ ఫైల్స్: హౌ మోడీ అండ్ అదానీ స్టోల్ ఇండియా’ పేరుతో రూపొందించిన 36 నిమిషాల వీడియోను భాటియా అక్టోబర్ 9న తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఎక్స్ వేదికపైనా ఇది ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఈ వీడియో వార్తా కథనం కాదని, అందులో చేసిన ఆరోపణలకు ఏ అధికారిక సంస్థ ఆధారాలు చూపలేదని న్యాయమూర్తి ఆర్యక్ దత్ పేర్కొన్నారు. దొంగతనాన్ని సూచించేలా శీర్షిక పెట్టి, నాటకీయ కథనాన్ని వాస్తవాలుగా చూపించారని కోర్టు అభిప్రాయపడింది. ఆధారాలతో కూడిన విమర్శలు, నిజాయతీతో కూడిన వార్తా కథనాలపై నిషేధం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే తొలగించిన వీడియోను భాటియా మళ్లీ అప్‌లోడ్ చేయడాన్ని ప్రాథమికంగా ఆయనకు చిత్తశుద్ధి లేదనడానికి సూచనగా వివరించింది. వీడియో ఉన్న లింకులను తొలగించాలని యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఆదేశించింది. సంబంధిత ఖాతాల వివరాలు, ఐపీ చిరునామాలు, లాగ్‌లను భద్రపరచాలని, గుర్తించలేని ఖాతాల వివరాలను రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణ జనవరి 31న జరగనుంది.







కామెంట్‌లు (0)