అదానీకి మరో భారీ విద్యుత్ ఒప్పందం
పశ్చిమ బెంగాల్‌కు 25 ఏండ్ల పాటు 2500మెగావాట్ల సరఫరా
ఏడాదికి రూ.8,500 కోట్ల వ్యాపారం
రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మించకుండానే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ సేకరణ
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి మరో భారీ ఒప్పందం తోడైంది. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో పశ్చిమ బెంగాల్‌కు 25 ఏండ్ల పాటు 2500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అనుబంధ సంస్థ దక్కించుకుంది. ఏడాదికి సుమారు రూ.8,500 కోట్ల విలువైన ఈ ఒప్పందం ద్వారా దీర్ఘకాలిక వ్యాపార ప్రయోజనాలను పొందనుంది. అయితే ఈ భారీ ఒప్పందం కోసం పశ్చిమ బెంగాల్లో ఒక్క కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టునూ నిర్మించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం.
కోల్‌కతా: బిడ్డింగ్ ప్రక్రియలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (ఏఈఎస్ఎల్) పూర్తిస్థాయి అనుబంధ సంస్థ పవర్పల్స్ ట్రేడింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్ విద్యుత్ పంపిణీ సంస్థ డబ్ల్యూబీఎస్ఈడీసీఎల్కు 25 ఏండ్ల పాటు విద్యుత్ సరఫరా చేయనుంది. 2028 జులై 1 నుంచి 1,750 మెగావాట్లు, 2029 ఏప్రిల్ 1 నుంచి మరో 750 మెగావాట్ల సరఫరా ప్రారంభం కానుంది. తొలి ఏడాది యూనిట్ విద్యుత్‌కు రూ.5.60 ధరను నిర్ణయిం చారు. తదుపరి సంవత్సరాల్లో ధరల సవరణకు అవకాశం కల్పించారు. ఈ ఒప్పందంలో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. పశ్చిమ బెంగాల్లో అదానీ గ్రూప్ కొత్తగా ఎలాంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించదు. ఇతర రాష్ట్రాల్లోని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి బెంగాల్‌కు సరఫరా చేయనుంది. ఇందులో అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి కూడా విద్యుత్ సేకరించే అవకాశం ఉంది.
అంటే విద్యుత్ ఉత్పత్తి ఇతర సంస్థల ద్వారా జరిగినా, సరఫరా ఒప్పందం మాత్రం అదానీ అనుబంధ సంస్థ చేతుల్లో ఉండనుంది. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలంటే సౌర, పవన విద్యుత్‌తో పాటు విద్యుత్ నిల్వ వ్యవస్థలు, ఆధునిక సరఫరా నిర్వహణ అవసరం. సాధారణంగా సౌర విద్యుత్ పగటిపూట మాత్రమే అధికంగా అందుబాటులో ఉంటుంది. పవన విద్యుత్ వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేసి నిరంతర సరఫరా అందించాల్సి ఉంటుంది. సరఫరా చేసే పునరుత్పాదక విద్యుత్‌లో కనీసం 51 శాతం పర్యావరణహిత విద్యుత్ అని ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగనుంది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనాల ప్రకారం 2025-26 నుంచి 2035-36 మధ్య విద్యుత్ వినియోగం ఏటా సగటున 5.46 శాతం, గరిష్ఠ డిమాండ్ 5.38 శాతం చొప్పున పెరగనుంది.
ఈ అవసరాలను తీర్చేందుకు 2035 నాటికి అదనంగా 5,251 మెగావాట్ల బొగ్గు విద్యుత్, 18,359 మెగావాట్ల సౌర విద్యుత్, 6,400 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం అవసర మని అంచనా. కాగా అదానీ గ్రూప్ చైర్మెన్ గౌతమ్ అదానీ.. సెప్టెంబరులో కోల్‌కతా పర్యట న సందర్భంగా 2036 నాటికి పశ్చిమ బెంగాల్ లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ రంగాల్లో పెట్టుబ డులు పెడతామని వెల్లడించారు. అయితే తాజా ఒప్పందంలో మాత్రం ఈ రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ సేకరించి సరఫరా చేయడమే ప్రధానంగా ఉంది. దీంతో మోడీ ప్రభుత్వంతో అదానీ గ్రూప్ సన్నిహిత సంబం ధాలపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు కొన సాగుతున్న నేపథ్యంలో.. ఆ గ్రూప్ వ్యాపార విస్తరణకు దక్కుతున్న భారీ దీర్ఘకాలిక ఒప్పం దాలు మరోసారి చర్చనీయాం శమవుతు న్నాయి. విద్యుత్ రంగంలో పెరుగుతున్న ప్రయి వేటు సంస్థల పాత్ర, దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల ప్రజా విద్యుత్ పంపిణీ సంస్థలపై పడే ఆర్థిక భారం వంటి అంశాలపై కూడా సమగ్ర పరిశీలన అవసరమనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.







కామెంట్లు (0)