ఢిల్లీ సర్ పై ఈసీని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై సుప్రీం కోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. గతంలోనే ఓటు హక్కు కలిగి ఉండి, ప్రస్తుత ముసాయిదా జాబితా నుంచి పేర్ల తొలగింపునకు గురైన వారిని మళ్లీ ఫారం- 6 సమర్పించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఎందుకు కోరుతోందని ప్రశ్నించింది. ఫారం- 6 అనేది సాధారణంగా తొలిసారి ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారి కోసం ఉద్దేశించినది అని అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. సర్ ప్రక్రియ సమయంలో ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసుల్లో పారదర్శకత లేదంటూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీం కోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.సాధారణంగా చిరునామా మార్పులు లేదా ఇతర ఓటరు వివరాల సవరణల కోసం ఫారం- 8 ఉపయోగిస్తారని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే ఓటరుగా నమోదైన వ్యక్తిని ముసాయిదాలో పేరు పోయినంత మాత్రాన మళ్లీ కొత్త ఓటరు కింద నమోదు చేసుకోవాలని పరిగణించడం సరైన విధానమా అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. "ఫారం- 6 అనేది జీవితంలో మొదటిసారి ఓటు హక్కు పొందే వారి కోసం. అడ్రస్ మారితే ఫారం- 8 నింపాలి. వసంత్ కుంజ్ నుంచి సరితా విహార్‌కు మారిన ఓటరు తన పాత వివరాలు, బూత్ నంబర్ చెప్పి కొత్త చిరునామా వివరాలు ఇవ్వగలడు. అంతే కానీ అలాంటి వారిని తొలిసారి ఓటరులా ఫారం- 6 సమర్పించాలని ఎందుకు అడుగుతున్నారు.?" అని - జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. మరోవైపు ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తి మళ్లీ ఫారం- 6 సమర్పించాల్సి రావడం అనేది తీవ్ర అసమానతలకు దారితీస్తుందని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు అనేది పౌరులకు అత్యంత కీలకమైనదని, దానిని నిర్లక్ష్యంగా అంత తేలికగా తొలగించలేరని స్పష్టం చేశారు.
ఢిల్లీలో 43 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయా?
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్- నివాసం మారడం లేదా అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సుమారు 43 లక్షల మంది పేర్లను ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని తెలిపారు. వీరు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోవడంతో పేర్లు చేర్చలేదని వివరించారు. చాలా మందికి ఫారం సమర్పించాలనే విషయం తెలియలేదని, మరికొందరికి పాత చిరునామాలకు ఫారాలు పంపించారని భూషణ్ వాదించారు. అయినా కూడా గతంలో ఓటర్లుగా నమోదైన వారిని ఇప్పుడు తిరిగి జాబితాలో చేర్చాలంటే ఫారం- 6 ఇవ్వాలని అధికారులు అడుగుతున్నట్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ ఓటరుగా నమోదు కాలేదని, ఓటు హక్కు పొందలేదని తప్పుడు ప్రకటన చేసినట్లవుతుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్యుమరేషన్ ఫారం గడువులోగా సమర్పించలేకపోయిన వారికి ఇప్పుడు కూడా అదే ఫారం ఇచ్చే అవకాశం కల్పించాలని సూచించారు. అదే విధంగా నివాసం మారినవారు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఫారం- 8 సమర్పించేలా అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు- డ్రాఫ్ట్ జాబితా ప్రచురించిన తర్వాత ఎన్యుమరేషన్ ఫారం స్వీకరించడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఫైనల్ ఓటర్ లిస్ట్ సిద్ధమయ్యే వరకు గతంలో నమోదైన ఓటర్లు ఆలస్యంగా అయినా ఫారాలు సమర్పించడానికి అవకాశం ఇవ్వొచ్చని సూచించింది. గడువు ముగిసిందన్న కారణంతో అదే ఫారం చెల్లనిదిగా మారాల్సిన అవసరం ఏం ఉందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలస్యంగా వచ్చినా ఎన్యుమరేషన్ ఫారాల్ని స్వీకరిస్తే ఎన్నో ఇబ్బందుల్ని పరిష్కరించవచ్చని అభిప్రాయపడింది.
ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా పేరు చేర్చుకోవచ్చు: ఈసీ
ఇక ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. సర్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, పిటిషనర్ లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తుది ఓటరు జాబితా ప్రచురించిన తర్వాత కూడా ఓటర్లు తమ పేర్లను చేర్చాలని అధికారులను సంప్రదించవచ్చని వెల్లడించారు. సర్ ప్రక్రియలో ఫారం- 6 ద్వారా పేరును మళ్లీ చేర్చడాన్ని కొత్తగా ఓటరుగా నమోదు చేయడంగా కాకుండా, సవరించిన జాబితాలో తిరిగి చేర్చడంగా చూడాలని ఈసీ తరఫు న్యాయవాది వివరించారు. చివరగా సుప్రీం కోర్టు- ఈ సర్ ప్రక్రియ గురించి సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్లు చేసుకోవాల్సిన సవరణల గురించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని పేర్కొంది. వాటికి స్పందించకపోతే ఎదురయ్యే పరిణామాలను కూడా వారికి వివరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.



![We are not against restoration; we are against the plunder being carried out in the name of the Musi [project].](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/Brs-1793216322963-0e75c4bf-e4c1-4722-876f-c497295fdc0d-360x240.webp)

కామెంట్లు (0)