Magazines

నెయ్యిలో కల్తీ.. ప్రజారోగ్యానికి ముప్పు

1 గంట క్రితం

Adulteration in ghee.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

ఢిల్లీలో 59 నెయ్యి నమూనాల పరీక్ష.. 19 తినడానికి ప్రమాదకరం

మరో నాలుగు నమూనాల్లో నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన

స్విగ్గీ, జొమాటో, జెప్టో, రిలయన్స్‌ నిల్వ కేంద్రాల్లో అపరిశుభ్రత

గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. బొద్దింకలు, బల్లులు, దోమల గుర్తింపు

కల్తీ నెయ్యి విక్రయ కేంద్రాల మూసివేతకు ఆదేశాలు


న్యూఢిల్లీ : పండుగల వేళ ఆహార పదార్థాల నాణ్యతపై ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. దేశ రాజధాని ఢిల్లీలో విక్రయిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ ఉన్నట్టు ఆహార భద్రతా శాఖ తనిఖీల్లో తేలింది. వివిధ బ్రాండ్లకు చెందిన 59 దేశీ నెయ్యి నమూనాలను పరీక్షించగా.. వాటిలో 19 నమూనాలు మనుషులు తినడానికి ప్రమాదకరమని అధికారులు గుర్తించారు. మరో నాలుగు నమూనాలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ఈ విషయాలను ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను సరఫరా చేసే సంస్థల నిల్వ కేంద్రాల్లోనూ తీవ్ర లోపాలు బయటపడ్డాయి. ఉత్తమ్‌నగర్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కేంద్రంలో గడువు ముగిసిన పచ్చి బఠానీలు, పెరుగు, చాక్లెట్‌ బిస్కెట్లు, ఆవు నెయ్యి ఉత్పత్తులను గుర్తించారు. కొన్ని పండ్లు, కూరగాయలు, మొలకల ప్యాకెట్లపై గడువు తేదీలు లేవు.

వజీర్‌పూర్‌లోని రిలయన్స్‌ రిటైల్‌ కేంద్రంలో ఈగలు, దోమలు, బల్లి, సాలెగూళ్లు కనిపించాయి. ఘేవ్రాలోని జొమాటో హైపర్‌ప్యూర్‌ కేంద్రంలో గడువు ముగిసిన ఉత్పత్తులతోపాటు అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించారు. జీల్‌ ఖురేజాలోని జెప్టో కేంద్రంలో ఆహార పదార్థాలను నిర్ణీత చల్లని ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం లేదని తేలింది. అక్కడ బొద్దింకలు, సాలెగూళ్లు కనిపించాయి.హర్యానా లైట్‌, హర్యానా సుప్రీం, హర్యానా డెయిరీ, హర్యానా ప్యూర్‌, శ్రీ హర్యానా కింగ్‌, శ్రీ హర్యానా ఫుడ్స్‌ వంటి తదితర బ్రాండ్ల నమూనాలు వినియోగానికి ప్రమాదకరమని అధికారులు ప్రకటించారు. నోవా, గోవర్ధన్‌ ప్యూర్‌ కౌ ఘీ, ప్రతాప్‌ దేశీ ఘీ నమూనాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడించారు.ప్రమాదకర నెయ్యి విక్రయిస్తున్న కేంద్రాలను మూసివేయాలనీ, వాటి లైసెన్సులను నిలిపివేయాలని ఆదేశించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆహార కల్తీతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడాన్ని సహించబోమని ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. మార్కెట్లు, ఆన్‌లైన్‌ ఆహార సరఫరా కేంద్రాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్