Magazines

దేశాభివృద్ధికి ప్రజారోగ్యం సాధనమన్న ‘డాక్టర్ వైఆర్‌కే’

50 నిమిషాల క్రితం

national development
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

నేడు డాక్టర్ యలమంచిలి 
రాధాకృష్ణమూర్తి 13వ వర్ధంతి

ప్రజారోగ్యం మందుల్లోనూ ఆస్పత్రుల్లోనూ లేదని, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో ఉందని చెప్పిన మార్క్సిస్ట్ మేధావి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్‌కే). ప్రజావైద్యుడు, సీపీఐ(ఎం)నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులైన వైఆర్‌కే.. 13వ వర్ధంతి నేడు(ఆక్టోబర్ 19). బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వైఆర్‌కే.. భారత దేశంలో పాలక పార్టీల వైఖరితో విద్యా వైద్యం వెనుకబాటుకు, నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. ఆయన విశాల దృక్పథంలో ఏ దేశపు మానవాభివృద్ధినైనా లెక్కించడానికి ఆరోగ్యం ఒక ప్రతీక. దేశాభివృద్ధికి సాధనం కూడా అదే. కానీ మనదేశంలో విద్యా వైద్య రంగాలకు బడ్జెట్‌లో నామ మాత్రపు కేటాయింపులేనని, తీరా వార్షిక నివేదికను పరిశీలిస్తే కేటాయించిన బడ్జెట్‌ను సైతం పూర్తిగా వినియోగించని పరిస్థితి ఉండేదని చెప్పేవారు. వైఆర్‌‌కే రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో పార్లమెంట్‌‌లో వైద్య రంగంపై అనేక ప్రసంగాలు చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సైతం ప్రశ్నించేవారు. ప్రజారోగ్యంలో రాజకీయ సంకల్పం లేని ప్రభుత్వ ధోరణులను నిశితంగా ఎండగట్టిన పార్లమెంటీరియన్‌గా గుర్తింపు పొందారు.

ఆరోగ్య సౌకర్యాలు లేకుండా, ఆరోగ్యాన్ని ఒక సమగ్ర రూపంలో చూడకుండా ఆరోగ్యం అసాధ్యమని జోసఫ్ జోర్ కమిటీ స్పష్టం చేసింది. అలాగే, 1952లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు జరిగిన తర్వాత రోగనిరోధకశక్తి, రోగనివారణ, పునరావాసం.. ఈ మూడు లక్ష్యాలు ప్రజారోగ్యానికి కీలకమని 1978లో అల్మా ఆటా కమిటీ సైతం ప్రతిపాదనలు చేసింది. కానీ ప్రభుత్వాలు వాటిని అమలుచేయడంలో నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. ఈ విధానాల రూపకల్పనల లోపం, అమలు చేయాల్సిన యంత్రాంగం బలహీనతలు, జాప్యం, అవినీతి, అలసత్వం, బడ్జెట్ కేటాయింపుల్లో చిన్నచూపు ఇవన్నీ ప్రజారోగ్యాన్ని ప్రయివేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా చేశాయనే లోతైన అవగాహనతో ప్రభుత్వాలపై పదునైన విమర్శలు చేసిన వ్యక్తి వైఆర్‌కే. మెడికల్ మాఫియాని గురించి డాక్టర్ వైఆర్‌కే ఆనాడే హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన 117 అత్యవసర మందులు చాలని హాథీ కమిషన్ చెప్పినా, 234 మందులు చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్‌ను ముంచెత్తున్న మందులపై పర్యవేక్షణ లేదని, ఎన్ని మెడికల్ షాపులకు ఒక డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఉండాలో ఈ ప్రభుత్వాలు నిర్ధారించలేదని ఆయన విమర్శించేవారు.

సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందుల సంఖ్య లెక్కకు మించి ఉన్నాయని ఆయన స్వీయ అనుభవంతో వివరించారు. తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతం కోసం నెలల తరబడి వైద్య వఅత్తిని త్యాగం చేశారు. ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో నెలల తరబడి జైళ్లలో మగ్గారు. అయినా చిరునవ్వుతో ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచారు. ఖమ్మం జిల్లాలో అనేక సభల్లో వక్తగా పీడిత ప్రజలను మేల్కొల్పిన ఆయన మేధస్సు.. పౌర హక్కుల ఉద్యమాలకు, దీనజనోద్దరణకు ఉత్ప్రేరకంలా దోహదపడింది. మంచికంటి రాంకిషన్ రావు, చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు.. రాజకీయ సహచర్యం జిల్లాలో సీపీఐ(ఎం) ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేశాయి. అన్ని రంగాలను కార్పొరేట్ భూతం ఆవహించిన నేటి స్థితిలో వైఆర్‌కే లాంటి మేధస్సులు సంఘటితం కావాల్సి ఉన్నది.
-​పారుపల్లి కృష్ణారావు



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్