Magazines

మతం మారితే.. వివక్ష తొలగిపోదు

1 గంట క్రితం

Changing one's religion
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందాల్సిందే

సుప్రీం రూలింగ్‌‌పై సీపీఐ(ఎం) ఆందోళన


న్యూఢిల్లీ : ఇస్లాం మతంలోకి మారిన వెనుకబడిన సామాజిక తరగతుల వారికి రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను అమల్జేయడానికి నిరాకరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌‌బ్యూరో శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. హిందూ మతం నుంచి మరో మతానికి మారిన వ్యక్తి, మత మార్పిడికి ముందు తన కులం ఆధారంగా లభించే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను ఆటోమేటిక్‌‌గా పొందలేరంటూ సుప్రీం కోర్టు రూలింగ్‌ ఇచ్చింది.ఇతర మతాలకు మారిన వారికి షెడ్యూల్డ్‌‌ కులాల రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను తిరస్కరిస్తూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కలిపి చూసినపుడు ఈ తీర్పు, రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, సామాజిక న్యాయం వంటి సూత్రాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. సామాజిక న్యాయాన్ని మత గుర్తింపు ద్వారా నిర్ధారించలేం. చారిత్రక అణచివేత కుల వివక్షత, విద్య అందుబాటులో అసమానతలు, ఉపాధి, ఆర్థికపరమైన అవకాశాలు వంటి వాస్తవికతల ఆధారంగా జరగాలి.

మత మార్పిడి జరిగినంత మాత్రాన కులపరమైన వివక్ష లేదా సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోవు. మతపరమైన హద్దులకు అతీతంగా కుల అణచివేత కొనసాగుతునే వుంటుంది. మత మార్పిడిని ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను నిరాకరించడం వల్ల రాజ్యాంగ సూత్రాలైన సమానత్వం, సామాజిక న్యాయం దెబ్బతింటాయి. అందువల్ల ఇతర మతాలకు మారిన వారికి తమ మత మార్పిడికి ముందు అందుబాటులో వున్న రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను నిరాకరించరాదని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. ఈ తీర్పుల ప్రతికూల పర్యవసానాలను అధిగమించడానికి గానూ సరైన రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి, ఏ మతానికి చెందినవారనేదానితో సంబంధం లేకుండా దళితులకు, వెనుకబడిన తరగతుల నుంచి మారిన వారికి రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలు అందచేయాలని కోరింది.వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్‌ ‌కులాలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్‌ హక్కులు దెబ్బతినకుండా వుండేలా రిజర్వేషన్లపై చట్టపరంగా విధించిన 50 శాతం పరిమితిని తొలగించేందుకు తగు రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్