Magazines

డిగ్రీలు పెరిగాయ్‌..కొలువులేవీ?

1 గంట క్రితం

but where are the jobs?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 4 నిమిషాల చదవడం

నాణ్యమైన ఉపాధిని కల్పించడంలో కేంద్రం విఫలం
ఉన్నత విద్యావంతుల్లోనూ తీవ్ర నిరుద్యోగం

పరిశ్రమల అవసరాలకు సరిపోని విద్యావిధానం..
ఏటా కోట్లాది మంది యువత భవిష్యత్తుపై ప్రశ్నలు

ఏటా కోటిమందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీల నుంచి నైపుణ్యాభివృద్ధి పథకాల వరకు.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రచారానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య అంతరం కనిపిస్తోంది. చేతిలో డిగ్రీలున్నా కొలువులు దక్కడం లేదు. చదువుకు తగ్గ పని లభించడం లేదు. మరోవైపు ఏఐతో ఉన్న ఉద్యోగాలకూ ముప్పు పెరుగుతోంది. యువశక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించుకుంటామని చెప్తున్న కేంద్రం.. తీవ్ర నిర్లక్ష్యాన్నిప్రదర్శిస్తోంది. ఆ యువతకు సరిపడా నాణ్యమైన ఉపాధిని కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది.


న్యూఢిల్లీ : దేశంలో డిగ్రీ చదివితే మంచి ఉద్యోగం వస్తుందనే నమ్మకం క్రమంగా సడలుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న యువతకు నిరాశే మిగులుతోంది. ప్రయివేటు రంగంలోనూ పట్టభద్రులకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా ఉన్న భారత్‌లో ఈ పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. యువతే దేశ బలమని చెప్తున్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ బలాన్ని ఉపాధి అవకాశాలుగా మార్చడంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


ఉన్నత విద్య.. అధిక నిరుద్యోగం

కేంద్ర ప్రభుత్వ పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) గణాంకాలు విద్యావంతుల ఉపాధి సమస్యను స్పష్టం చేస్తున్నాయి. 2022–23లో పట్టభద్రుల నిరుద్యోగ రేటు 13.4 శాతంగా ఉండగా.. 2023–24లో 13 శాతంగా నమోదైంది. 2025 గణాంకాల్లో ఇది 22.3 శాతంగా ఉంది. పీజీ, అంతకంటే ఉన్నత విద్య చదివినవారిలో నిరుద్యోగ రేటు 2022–23లో 12.1 శాతం, 2023–24లో 12.4 శాతం ఉండగా.. 2025లో 24.7 శాతంగా నమోదైంది. ఉన్నత విద్య చదివినవారికి తగిన ఉపాధి కల్పించడం దేశం ముందున్న ప్రధాన సమస్యగానే ఉంది. నిటి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. పట్టభద్రుల్లో కేవలం 8.25 శాతం మందికే తమ విద్యార్హతలకు సరిపోయే ఉద్యోగాలు లభిస్తున్నాయి.

డిగ్రీలున్నా.. నైపుణ్యాలేవీ?

బీహార్‌కు చెందిన షింపి కుమారి (25) జంతుశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, ప్రతిభ ఆధారంగా రూ.50 వేల ఉపకార వేతనం పొందింది. అయినా ఉద్యోగం దొరకలేదు. కంప్యూటర్‌ నైపుణ్యాలు నేర్చుకుని డేటా ఎంట్రీ ఉద్యోగం కోసం ప్రయ త్నించినా ఫలితం లేకపోయింది. మూడేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమ వుతున్నా విజయం సాధించలేకపోయింది. ఢిల్లీలో భౌగోళిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన దయానంద్‌ శర్మ నాలుగేండ్లుగా గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నా శాశ్వత ఉద్యోగం దక్కలేదు. ఆయనకు లభించే వేతనం కూడా కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు.

విద్యావ్యవస్థ, ఉద్యోగ మార్కెట్‌ మధ్య పెరుగుతున్న అంతరం

ఇవి వ్యక్తిగత వైఫల్యాలు మాత్రమే కావనీ, విద్యావ్యవస్థ, ఉద్యోగ మార్కెట్‌ మధ్య పెరుగుతున్న అంతరానికి ఉదాహరణలని మేధావులు, విద్యావేత్తలు చెప్తున్నారు. ''అనేక కళాశాలల్లో పాత పాఠ్యాంశాలనే బోధిస్తున్నారు. పరిశ్రమలకు అవస రమైన సాంకేతిక పరిజ్ఞానం, పని అనుభవం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం విద్యార్థులకు అందడం లేదు. ఖరీదైన ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు పొందినవారిలోనూ ఉద్యోగానికి అవస రమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. విద్యా ప్రమా ణాలను పెంచడం, పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులను మార్చడం ప్రభుత్వ విధానాల్లో కీలక ప్రాధాన్యం పొందాల్సిన అంశాలు'' అని వివరిస్తున్నారు.

ఏఐతో ఉద్యోగాలకూ ముప్పు

ఒకప్పుడు భారీగా ఉద్యోగాలు కల్పించిన ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్‌, కస్టమర్‌ సేవల రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం పెరుగుతోంది. సమాచార విశ్లేషణ, సాధారణ సాఫ్ట్‌వేర్‌ పనులు, వినియోగదారులకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులను ఏఐ చేయగలగడంతో కొన్ని ఉద్యోగాల్లో సిబ్బంది అవసరం తగ్గవచ్చు. నిటి ఆయోగ్‌ అంచనా ప్రకారం.. సేవల రంగంలో 40–50 శాతం కార్యాలయ ఉద్యోగాలను ఆటోమేట్‌ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు కొత్త సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోని యువతకు అవకాశాలు తగ్గే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. ఈ మార్పులను ఎదుర్కొనేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, కొత్త రంగాల్లో ఉద్యోగాలను ప్రోత్స హించడం ప్రభుత్వానికి కీలక బాధ్యత అని నిపుణులు చెప్తున్నారు.

పరిశ్రమల కొరత.. వృత్తులపై చిన్నచూపు

భారత్‌లో తయారీ రంగం ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడం కూడా ఉద్యోగాల కొరతకు ఒక కారణంగా ఉంది. చైనా వంటి దేశాలు పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించగా.. భారత్‌ సేవల రంగంపైనే అధికంగా ఆధారపడింది. మరోవైపు, వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్‌ల వంటి నైపుణ్య వృత్తులకు తగిన గౌరవం లేకపోవడంతో యువత వాటివైపు వెళ్లడానికి వెను కాడుతోంది. తాజా గణాంకాల ప్రకారం.. 18–29 ఏండ్ల యువతలో నిరుద్యోగ రేటు 14.8 శాతంగా ఉంది. 15–29 ఏండ్ల వయసున్న 8.7 కోట్ల మంది విద్య, ఉద్యోగం, శిక్షణకు దూరంగా ఉన్నారు. స్థిరమైన ఉద్యోగాలు దొరకక చాలామంది ఆహార పంపిణీ, రవాణా, ఆన్‌లైన్‌ సేవల వంటి గిగ్‌ పనులపై ఆధారపడుతున్నారు. ఈ పనులు కొంత ఆదా యాన్ని అందించినా.. ఉద్యోగ భద్రత, స్థిరమైన వేతనాలు, భవిష్యత్తులో ఎదుగుదలపై అనిశ్చితి కొనసాగుతోంది.

యువతకు హామీలు కాదు..ఉపాధి కావాలి

విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడం, కళాశాలల్లో ఆచరణాత్మక శిక్షణను పెంచడం, వృత్తి విద్యకు గౌరవం కల్పించడం, తయారీ రంగంలో ఉద్యోగాలను విస్తరించడం అత్యవసరమని మేధావులు, నిపుణులు చెప్తున్నారు. ''జర్మనీ తరహాలో చదువుతోపాటు పరిశ్రమల్లో పనిచేస్తూ నేర్చుకునే విధానాన్ని ప్రోత్సహించాలి. ఏఐ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ పథకాల ఫలితాలను కేవలం ప్రకటనలతో కాకుండా, శిక్షణ పూర్తి చేసినవారి సంఖ్య, లభించిన ఉద్యోగాలు, వేతనాలు, ఉద్యోగ భద్రత ఆధారంగా అంచనా వేయాలి'' అని వారు అంటున్నారు. యువతే దేశ భవిష్యత్తని చెప్పడం సరిపోదనీ, వారి చదువుకు తగిన ఉద్యోగాలు, న్యాయమైన వేతనాలు, స్థిరమైన ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు. మోడీ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను ఆచరణలో ఎంతవరకు నెరవేర్చిందన్న ప్రశ్నకు సమాధానం గణాంకాల్లోనూ, నిరుద్యోగుల జీవితాల్లోనూ కనిపించాలని అంటున్నారు. విద్యావంతులైన యువతకు అవకాశాలు కల్పించలేకపోతే, దేశానికి వరంగా మారాల్సిన యువ జనాభా ఆర్థిక, సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రచారానికి..అమలుకు మధ్య అంతరం

యువతకు నైపుణ్యాలు, ఉపాధి కల్పించేందుకు కేంద్రం స్కిల్‌ ఇండియా, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. కానీ వాటి అమలుపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం ద్వారా ఐదేండ్లలో కోటి మందికి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి విడతలో 1.27 లక్షల ఇంటర్న్‌షిప్‌ అవకాశాల్లో 3,995 మంది మాత్రమే శిక్షణను పూర్తి చేసినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన వివరాలు చెప్తున్నాయి. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 ప్రకారం 2025 నాటికి కనీసం 50 శాతం మంది విద్యార్థులకు వృత్తి విద్య అందించాలనే లక్ష్యం ఉన్నా.. దేశంలోని తక్కువ పాఠశాలల్లోనే వృత్తి విద్య అందుబాటులో ఉంది. స్కిల్‌ ఇండియా కార్యక్రమంలోనూ శిక్షణ నాణ్యత, ఉద్యోగాల కల్పన, నిధుల వినియోగంపై లోపాలను కాగ్‌ గుర్తించడం కేంద్రం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక లక్ష్యాలు ప్రకటించడం ఒక ఎత్తయితే.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడం మరో ఎత్తు. అయితే మోడీ ప్రభుత్వానికి అసలు పరీక్ష రెండో అంశంలోనే కనిపిస్తోంది.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్