Magazines

రుణాలపై మ‌రింత‌ వడ్డీ పోటు

2 గంటల క్రితం

burden of high
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

రెపోరేటును పెంచిన ఆర్బీఐ
హోమ్ లోన్ ఈఎంఐలు భారం
భవిష్యత్తులోనూ తగ్గింపు ఉండదు : గవర్నర్ సంజయ్ మల్హోత్రా


ముంబయి : అదాయాలు పెరగక ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు మరింత భారం కానున్నాయి. కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. దీంతో గృహ, వాహన, రిటైల్‌ ‌తదితర రుణాలు భారం కానున్నాయి. 2023 ఫిబ్రవరి తర్వాత వడ్డీ రేటును పెంచడం ఇదే తొలిసారి. దాదాపు నాలుగేండ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ ‌మల్హోత్రా తెలిపారు. ఎంపీసీ ముగింపు అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థలపై ఒత్తిళ్లు, బలహీన రుతుపవనాల నేపథ్యంలో భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని మల్హోత్రా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీసీ తన విధాన వైఖరిని తటస్థం నుంచి కఠినతరం వైపు మార్చిందన్నారు.

ఆరుగురు సభ్యుల కమిటీలో నలుగురు సభ్యులు ఈ మార్పునకు అనుకూలంగా ఓటు వేశారన్నారు. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశం లేదని గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును ఆర్బీఐ 5.25 శాతానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) జీడీపీ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచింది. తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి చోటు చేసుకోగా.. రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో త్రైమాసికంలో 6.9 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2027-28 తొలి త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగానే కొనసాగుతున్నాయని మల్హోత్రా తెలిపారు.2026-27లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) అంచనాను 5 శాతం నుంచి 5.2 శాతానికి పెంచింది. ముడిచమురు ధరల పెరుగుదల, సరఫరా వైపు ఒత్తిళ్లు, అంతర్జాతీయ అనిశ్చితులు, బలహీన రుతుపవనాల ప్రభావం ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందన్నారు.


మార్కెట్లకు వడ్డీ రేట్ల సెగ

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఈ పరిణామంతో గత రెండు సెషన్లుగా కొనసాగిన లాభాల ర్యాలీకి బ్రేక్ పడింది. రెపో రేటును 5.5 శాతానికి పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యంగా మెటల్, రియాల్టీ రంగాల షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగాలలో అమ్మకాల ఒత్తిడి వ్యక్తమవడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బుధవారం సెషన్‌‌లో సెన్సెక్స్ రోజంతా ప్రతికూలతలోనే కదలాడి ఇంట్రాడేలో 72,469 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 429.11 పాయింట్లు కోల్పోయి 72,639కి పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 173 పాయింట్లు పతనమై 22,603 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.77గా కొనసాగింది. సెన్సెక్స్-30 జాబితాలో కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రమే లాభపడగా.. మిగతా కంపెనీలన్నీ నష్టాలను చవి చూశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్