Magazines

ఈసీ నియామకాల భిన్న తీర్పులను పరిశీలిస్తాం

2 గంటల క్రితం

ec
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

పిటిషన్‌ ‌పరిశీలనకు ‘సుప్రీం’ అంగీకారం

అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాం : ప్రధాన న్యాయమూర్తి


న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన 2023 చట్టంపై దాఖలైన పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై సెప్టెంబర్ 23న వెలువడిన భిన్నమైన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ప్రధాని, లోక్‌సభ విపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ చేసే సిఫారసులపై సీఈసీ, ఈసీల నియామకాలను రాష్ట్రపతి చేపడతారని 2023 మార్చి 2న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సీజేఐ బదులు కేంద్ర మంత్రికి అవకాశమిస్తూ ఆ ఏడాది డిసెంబరులో పార్లమెంటులో చట్టాన్ని రూపొందించడంతో దాని రాజ్యాంగబద్ధ చెల్లుబాటును పలువురు సవాల్‌ చేశారు. ఈ పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలా? అనే అంశంపై సెప్టెంబర్ 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ అంశంపై ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఫలితంగా భిన్నమైన తీర్పులు వెలువడ్డాయి.


భిన్న తీర్పులు
ఈ కేసును మరింత విస్తృతమైన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని కేంద్రం కోరింది. అయితే జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ అభ్యర్థనను తిరస్కరించారు. ఎంపిక కమిటీలో ఒక క్యాబినెట్‌ మంత్రిని చేర్చడం వల్ల దాని తటస్థ స్వరూపం పోతుంది. 2023 చట్టం కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాన్ని కట్టబెడుతుందని అభిప్రాయపడ్డారు. విపక్ష నేత ఉనికి నామమాత్రం అవుతుందని, కమిటీలో ఆయనను చేర్చిన ఉద్దేశం అలంకారప్రాయంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. కానీ, జస్టిస్ దత్తా వ్యాఖ్యను వ్యతిరేకిస్తూ, కేంద్ర వాదనను జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ మాత్రం ఏకీభవించారు. ఆర్టికల్‌ 145(3) ప్రకారం ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం అధికారికంగా నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై విస్తృత ధర్మాసనం పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వద్దకు పరిపాలనా పరంగా పంపాలని ద్విసభ్య ధర్మాసనం నిర్ణయించింది. తగిన సంఖ్యలో న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, అంశంపై సమర్థవంతమైన, తుది నిర్ణయం తీసుకునేలా చేయాలని సూచించింది.


తీర్పు వెనక్కి తీసుకోవాలంటూ పిటిషన్
ఈ పరిణామాల నేపథ్యంలో భిన్నమైన తీర్పును రీకాల్ చేయాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ బుధవారం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. పిటిషన్‌ను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీజేఐ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్