Magazines

ట్రూఅప్‌ చార్జీల భారం మోపొద్దు

2 గంటల క్రితం

burden up charges.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

ఈ పెంపు పేదల నడ్డి విరవడమే

వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ బకాయిల్ని విడుదల చేయాలి : సీపీఐ(ఎం)


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ దారులపై రూ.7,635 కోట్ల మేర ట్రూ-అప్ చార్జీల పేరుతో భారాన్ని మోపాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ, ఈఆర్‌సీ విధానాలను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్‌‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచాలన్న డిస్కమ్‌ల నిర్ణయించడం సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరవడమేనని పేర్కొన్నారు. ఈ పెంపుదల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేనట్లయితే కలిసొచ్చే శక్తులతో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సంస్థల అసమర్థ నిర్వహణను సాకుగా చూపి ఇప్పుడు ప్రజలపై ఈ అదనపు భారాన్ని మోపడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు అల్లాడిపోతుంటే, మరోవైపు కరెంటు చార్జీల పెంపుతో వారి బతుకులు మరింత భారంగా మారుతున్నాయని వాపోయారు.

ప్రభుత్వ శాఖల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఒక్క నీటిపారుదల శాఖ నుంచే ఎత్తిపోతల పథకాల కింద రావాల్సిన బకాయిలే రూ.29 వేల కోట్లకు పైగా ఉన్నాయనీ, ఆ భారాలన్నింటినీ నేడు ప్రజల మీదకు నెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తక్షణమే ఈ ట్రూ-అప్ చార్జీల వసూళ్ల నిర్ణయాన్ని, యూనిట్ల మీద అదనపు పెంపుదల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రపంచబ్యాంకు సంస్కరణలు, విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక ‘విద్యుత్ ఉద్యమం’ స్పూర్తితోనే ఈ చార్జీల భారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌‌లో ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ‌బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఫీజులు కట్టలేదనే సాకుతో చాలా కాలేజీల యాజమాన్యాలు పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనీ, అవసరమైతే డబ్బులు కట్టి తీసుకెళ్లాలని బెదిరిస్తున్నాయని ప్రస్తావించారు. విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరం కాకుండా వెంటనే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ‌బకాయిలను విడుదల చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్