Magazines

భారత ప్రతిభ విదేశాలకు

4 గంటల క్రితం

Indian talent heads abroad
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 3 నిమిషాల చదవడం

విదేశాల్లో చదివిన భారతీయుల్లో 63 శాతం అక్కడే స్థిరనివాసం
భారత్‌లో చదివిన విదేశీయుల్లో 47 శాతం స్వదేశాలకు పయనం

‘టాలెంట్‌ బియాండ్‌ బోర్డర్స్‌’ నివేదిక..
యువతకు మెరుగైన అవకాశాల కల్పనలో కేంద్రానికి సవాల్‌

ప్రపంచ దేశాలు నైపుణ్యం కలిగిన యువతను ఆకర్షించేందుకు పోటీ పడుతుంటే.. భారత్‌ మాత్రం తన ప్రతిభను నిలుపుకోవడంలో విఫలమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన భారతీయుల్లో అధిక శాతం మంది అక్కడే స్థిరపడుతుండగా.. భారత్‌లో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది స్వదేశాలకు తిరిగి వెళ్తున్నారు. యువతకు నాణ్యమైన ఉద్యోగాలు, పరిశోధన సదుపాయాలు, మెరుగైన వేతనాలు లేకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు చెప్తున్నారు. ఇది కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు.

న్యూఢిల్లీ : దేశాన్ని ప్రపంచ నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. విదేశాల్లో చదివిన భారతీయుల్లో 63 శాతం మంది అక్కడే ఉండిపోతున్నారన్న గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రతిభావంతులైన యువతకు దేశంలోనే తగిన అవకాశాలు కల్పించలేకపోతే, వారి విద్య, నైపుణ్యాల ప్రయోజనాలను ఇతర దేశాలు పొందే పరిస్థితి కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన పట్టభద్రులను ఆకర్షించేందుకు దేశాల మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది. అయితే భారత్‌ ఈ పోటీలో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో చాలామంది తమ దేశాలకు తిరిగి వెళ్తుండగా, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన భారతీయుల్లో అధిక శాతం మంది అక్కడే స్థిరపడుతున్నారు. స్టడీపోర్టల్స్‌, కేంబ్రిడ్జ్‌ ఐఈఎల్‌టీఎస్‌ రూపొందించిన ‘టాలెంట్‌ బియాండ్‌ బోర్డర్స్‌’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో 47 శాతం మంది తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారు. మరోవైపు, విదేశాల్లో చదువుకున్న భారతీయుల్లో 63 శాతం మంది అక్కడే ఉండిపోయినవారిగా గుర్తించారు. ఈ గణాంకాలు భారత ఉన్నత విద్యా వ్యవస్థ, ఉద్యోగావకాశాలు, పరిశోధన రంగాల్లో మరింత మెరుగుదల అవసరాన్ని సూచిస్తున్నాయి. యువతకు దేశంలోనే నాణ్యమైన ఉపాధి, తగిన వేతనాలు, వృత్తిపరమైన ఎదుగుదల లభిస్తే విదేశాలకు వెళ్లాలనే ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దేశంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ఈ నేపథ్యంలో యువతకు తగిన అవకాశాలు కల్పించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సాధించిన పురోగతిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేశాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని ప్రకటించే మోడీ సర్కారు.. నైపుణ్యం కలిగిన యువత భారత్‌లోనే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించలేకపోతోంది.

ప్రతిభతో లక్షల కోట్ల ఆదాయం

అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడం కేవలం విద్యా రంగానికి సంబంధించిన అంశం కాదు. అది దేశ ఆర్థిక భవిష్యత్తుతో ముడిపడి ఉంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులు తమ జీవితకాలంలో పనిచేయడం ద్వారా ఆతిథ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు సుమారు 1.7 లక్షల కోట్ల డాలర్ల మేరకు తోడ్పడతారని నివేదిక అంచనా వేసింది. ఇందులో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాల వాటా సుమారు లక్ష కోట్ల డాలర్లుగా ఉండనుంది. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాలు చేస్తే ఆయా దేశాలకు నైపుణ్యం కలిగిన కార్మికులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు లభిస్తారు. తద్వారా ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత్‌ కూడా తన విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, నైపుణ్యాలకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది. కేవలం అభివృద్ధి నినాదాలతో కాకుండా, యువతకు అందుబాటులో ఉండే ఉద్యోగాలు, పరిశోధన సదుపాయాలు, మెరుగైన వేతనాల ద్వారా ఫలితాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిపుణులు చెప్తున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే..

విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే కొనసాగుతున్న విషయంలో కెనడా 66 శాతంతో ముందుంది. ఆస్ట్రేలియాలో 53 శాతం, జర్మనీలో 49 శాతం, ఐర్లాండ్‌లో 45 శాతం, అమెరికాలో 44 శాతం మంది అంతర్జాతీయ పట్టభద్రులు అక్కడే ఉంటున్నారు. నైపుణ్యమున్న యువతను తమ ఆర్థిక వ్యవస్థల్లో భాగం చేసుకునేందుకు ఈ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయ పోటీ తీవ్రతను తెలియజేస్తున్నాయి. భారత్‌ కూడా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంతోపాటు, ఇక్కడ చదివినవారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే విదేశాల్లో చదువుకున్న భారతీయులు తిరిగి వచ్చి పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని నిర్మించాలి. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు, పోటీకి తగిన వేతనాలు, అత్యాధునిక పరిశోధన సదుపాయాలు, కెరీర్‌లో ఎదిగే అవకాశాలు అందుబాటులో ఉండాలని మేధావులు, నిపుణులు సూచిస్తున్నారు.

విదేశాల్లో ఉన్నా దేశానికి ఉపయోగమే

విదేశాల్లో స్థిరపడిన భారతీయులంతా దేశానికి దూరమైనట్టు అర్థం కాదు. అయితే విదేశాల్లో చదివి తిరిగి వచ్చేవారు అంతర్జాతీయ పరిజ్ఞానం, పరిశోధన అనుభవం, వ్యాపార సంబంధాలను భారత్‌కు తీసుకురాగలరు. విదేశాల్లోనే ఉండిపోయినవారు సైతం అంతర్జాతీయ పరిశోధనలు, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి ద్వారా దేశానికి తోడ్పడవచ్చు. అయితే, ఇలాంటి అవకాశాలు ఉన్నాయనే కారణంతో దేశంలో ప్రతిభను నిలుపుకోవాల్సిన అవసరాన్ని విస్మరించలేం. యువత విదేశాలకు వెళ్లడం తప్పు కాదు.. కానీ స్వదేశంలో తగిన అవకాశాలు లేకపోవడం వల్లే అక్కడే స్థిరపడాల్సి వస్తుంటే, అది ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. భారత యువతకు నాణ్యమైన విద్య, పరిశోధన, ఉపాధి, గౌరవప్రదమైన వేతనాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, లేకపోతే, దేశ యువత సంపాదించిన నైపుణ్యాల ఆర్థిక ప్రయోజనాలను ఇతర దేశాలు పొందుతుండగా, భారత్‌ మాత్రం తన ప్రతిభను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్