Magazines

జోక్యం చేసుకోండి..

57 నిమిషాల క్రితం

president
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

- ​రాష్ట్రపతికి ఇండియా’ బ్లాక్ నేత‌ల వినతి

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్వీర్యం చేస్తున్నారని ఇండియా బ్లాక్ నేత‌లు ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును హరిస్తూ ప్రజాస్వామ్య పునాదులనే దెబ్బతీస్తున్నారని విమ‌ర్శించారు. ఈ స‌మ‌యంలో రాష్ట్రప‌తి జోక్యం చేసుకోవాల‌ని కోరారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తించి, తమ డిమాండ్లపై తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత వ్యవస్థలకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్ర‌వారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇండియా బ్లాక్ నేత‌ల ప్ర‌తినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష‌నేత‌లు రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జ‌మ్ముకాశ్మీర్ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా, ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ, సీపీఐ(ఎం), సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎంఎ బేబీ, డి.రాజా, సుప్రీయా సులే (ఎన్సీపీ), మ‌నోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), రాజీవ్ రాయ్ (ఎస్పీ), తిరుమావళవన్ (వీసీకే) నేత‌లు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. శుక్ర‌వారం సాయంత్రం పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంలోని సెంట్ర‌ల్ హాల్‌లో ఇండియా బ్లాక్ నేత‌ల స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం ‘ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించండి’ అంటూ భారీ బ్యాన‌ర్‌తో పార్ల‌మెంట్ నుంచి విజ‌య్‌ చౌక్‌ వ‌ర‌కు ‌నేతలు మార్చ్ నిర్వ‌హించారు. సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్‌కు, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇండియా బ్లాక్‌ ఎంపీలు ప్లకార్డులు చేతబూని నినాదాల హోరెత్తించారు. విజ‌య్ చౌక్ కు సమీపంలో పోలీసులు మార్చ్‌‌ను అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపైనే బైటాయించారు. అనంత‌రం ఇండియా బ్లాక్ నేత‌ల ప్ర‌తినిధి బృందం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్మును కలిసి విన‌తి ప‌త్రం అంద‌జేసింది. అనంతరం ఇండియా బ్లాక్‌ ‌నేతలు మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా బ్లాక్ ఎంపీల తరపున‌ ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని పేర్కొన్నారు. మరికొన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు), ఓటర్ల జాబితాలను బీజేపీ పూర్తిగా తారుమారు చేసిందని వివ‌రించారు. ఎన్నికల అక్రమాలపై ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా హత్య చేస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని, అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా పోయాయని అన్నారు.​ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326లో పొందుపరిచిన ఓటు హక్కు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి పునాది అని వారు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆ హక్కుకు రాజ్యాంగబద్ధమైన సంరక్షకురాలే తప్ప యజమాని కాదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలే తప్ప రాజకీయ నాయకత్వానికి కాదని తెలిపారు. ఓటు హక్కుకు సంబంధించిన నిబంధనలను ఏకపక్షంగా మార్చడం, నిర్ణయాలకు జవాబుదారీతనాన్ని తప్పించుకోవడం, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం వంటి చర్యలను అనుమతించరాదని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన కీలక సమయంలో మిగిలిన అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు దేశ ప్రజలు రాష్ట్రపతిని ఆశ్రయిస్తారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తించి, తమ డిమాండ్లపై తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత వ్యవస్థలకు సూచించాలని కోరారు.


​వినతిప్రతంలోని నాలుగు ప్రధాన డిమాండ్లు

​1. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి. 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలి.

​2. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. అక్రమంగా తొలగించిన 13.30 కోట్ల మంది ఓటర్ల పేర్లను వెంటనే పునరుద్ధరించాలి.

​3. అన్ని ఎన్నికల్లోనూ కాగితపు బ్యాలెట్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.

​4. గత రెండేండ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలు సమర్పించిన చోట్ల ఆ ఎన్నికలను రద్దు చేయాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్