Magazines

స‌ర్ ఆందోళ‌న‌ల్లో బీఆర్ఎస్ ఎక్క‌డ ?

55 నిమిషాల క్రితం

mahesh kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 2 నిమిషాల చదవడం

న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్ : స‌ర్ ప్ర‌క్రియ‌ను వ్య‌తిరేకిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న త‌రుణంలో...ఆయా ఆందోళ‌న‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ ఎక్క‌డుంద‌ని టీపీసీసీ అధ్య‌క్షులు బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్ ప్ర‌శ్నించారు. ఈ అంశంపై ఆ పార్టీ నేత‌లు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు ఎందుకు నోరు మెద‌ప‌టం లేదని ఆయ‌న నిల‌దీశారు. కేంద్రం వ‌ద్ద‌నున్న కాళేశ్వ‌రం కేసులను తిర‌గ‌తోడ‌తార‌నే భ‌య‌మా? లేక బీజేపీతో చేసుకున్న లోపాయికారీ ఒప్పందాల ఫ‌లిత‌మా..? అని ఆయ‌న ఎద్దేవా చేశారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... స‌ర్‌కు వ్య‌తిరేకంగా బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు త‌ప్ప మిగ‌తా పార్టీల‌న్నీ రోడ్డెక్కాయ‌ని గుర్తు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్... ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తోంటే బీఆర్ఎస్ నేత‌లు ఎందుకు నోరు మెద‌ప‌టం లేద‌న్నారు. స‌ర్ ద్వారా దేశంలోని గిరిజ‌నులు, మైనారిటీల ఓట్ల‌ను ఇష్టానుసారంగా తొలగిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాల పేరిట ఓట్ల‌ను తొల‌గించిన బీజేపీ... అడ్డ‌దారుల్లో గ‌ద్దెనెక్కింద‌ని విమ‌ర్శించారు. ఇదే ర‌కంగా బీహార్ లోనూ ఆర్జేడీని గెల‌వ‌కుండా చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీ అగ్ర‌నేత‌లు ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ... కేంద్రంపై అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నార‌ని గుర్తు చేశారు. కానీ మ‌న రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క నిర‌స‌న కూడా చేప‌ట్ట‌లేద‌ని విమ‌ర్శించారు. ఈ వ్య‌వ‌హారంపై మాట్లాడితే ఈ-ఫార్ములా కేసులో అరెస్టు చేశార‌నే భ‌యం కేటీఆర్‌కు ప‌ట్టుకుంద‌ని ఎద్దేవా చేశారు. గ‌తంలో త‌న‌కు ఉండ‌టానికి ఇల్లే లేదన్న కేటీఆర్ కు ఫైవ్ స్టార్ హోట‌ళ్లు , వేల కోట్ల ఆస్తులు ఆయ‌న‌కు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయంటూ నిల‌దీశారు. స‌ర్ కు వ్య‌తిరేకంగా కేంద్రంపై మాట్లాడితే... త‌న బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే ఆందోళ‌న‌లో కేటీఆర్ ఉన్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ​నిర‌స‌న‌లు కొన‌సాగుతాయి... సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను ప‌ద‌వి నుంచి తొలగించే వరకు ఇండియా బ్లాక్ త‌ర‌పున నిరసనలు కొన‌సాగుతాయ‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ సాకులు చూపి మొత్తం 90 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారని తెలిపారు. టీఎన్ శేష‌న్‌, లింగ్డో, కృష్ణ‌మూర్తి... ప్ర‌ధాన ఎన్నికల క‌మిష‌న‌ర్లుగా ఉన్న‌ప్పుడు ఓట‌ర్ల స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌కు పూర్తి స్థాయిలో న్యాయం జ‌రిగింద‌న్నారు. అందుకు భిన్నంగా జ్ఞానేశ్ కుమార్ హ‌యాంలో ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ పూర్తిగా అభాసుపాలైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ త‌ర్వాతి ల‌క్ష్యం తెలంగాణాయేన‌ని ఆయన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తోపాటు ఇండియా బ్లాక్‌లోని పార్టీల‌న్నీ అప్ర‌మ‌త్తంగా ఉండి, స‌ర్ ప్ర‌క్రియ‌లోని అక్ర‌మాల‌కు అడ్డుకట్ట వేయాల‌ని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్