- రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్యయనం:క్యూర్ పరిధిలో పనుల సమీక్షలో సీఎం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ : క్యూర్ పరిధిలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రజా రవాణా సదుపాయాలు మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా మెరుగు, వివిధ రహదారుల అనుసంధానత, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై శుక్రవారం రాత్రి సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో విపరీతమైన రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్టీ) సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధికారులు ఈ సందర్భంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఎక్కువ మంది రవాణా సాగించే ప్రదేశాలతోపాటు వివిధ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు రాకపోకలు సాగించే ప్రదేశాల నుంచి మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో అనుసంధానించేందుకు వీలుగా పీఆర్టీ ఉండేలా డిజైన్ చేయాలని సీఎం వారికి సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ముఖ్యమైన కాలనీల ఎంపిక, అత్యాధునిక సాంకేతికత, నిర్వహణకు పెద్ద పీట వేయాలన్నారు. క్యూర్ పరిధిలో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరిగేలా, రహదారుల్లో సజావుగా రాకపోకలు సాగించేలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేతో రాకపోకలు మరింత సజావుగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం... అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పార్క్ చుట్టూ వన్ వేకు వివిధ కాలనీలు, రహదారుల నుంచి వచ్చే రహదారులు కలిసే చోటుతో పాటు ఫ్రీ లెఫ్ట్, యూటర్న్ ల విషయంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. యూటిలిటీస్ తరలింపును వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం వారిని ఆదేశించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు వైపు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ముంబయి వంటి నగరాల్లో ఏడాదిలోపే పనులు పూర్తవుతున్నాయని, అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, పనుల తీరుపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రారంభించిన పనులు ఏడాదిలోపు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణంపై అధ్యయనం చేయాలని సూచించారు. శంకర్‌పల్లి-చేవెళ్ల మధ్య ఇప్పుడున్న రహదారుల విస్తరణతో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 500 ఎంఎల్‌డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అధికారులు ఆయనకు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి, ఆలూరులోని డాటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు రీసైకిల్డ్ వాటర్ వినియోగించుకునేందుకు వీలుగా పనులు చేపట్టాలని కోరారు. హైరైజ్ బిల్డింగుల నిర్మాణం, ల్యాండ్ స్కేప్స్, పార్కుల్లో రీసైకిల్డ్ వాటర్ వాడేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. క్యూర్ చట్టం అమలుకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు, హైడ్రా, వాటర్ బోర్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కార్యాలయాల పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)