Magazines

జీఎస్టీ సంస్కరణల్లో 
రాష్ట్రాల ప్రయోజనాలు ఉండాలి

2 గంటల క్రితం

safeguarded in GST
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 4 నిమిషాల చదవడం

నిజాయితీ పన్నుదారులకు సులభమైన విధానం.. పన్ను మోసాలపై కఠిన చర్యలు

తెలంగాణకు ఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయ ప్రభావం..
మరింత ఆర్థిక నష్టం జరిగే అవకాశం

హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

స్క్రాప్ రంగం, గుర్తింపు దొంగతనాలపై మంత్రుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన :
 ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క


నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించడంతో పాటు, ఉద్దేశపూ ర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలుకు పునాది పరస్పర విశ్వాసమేనని భట్టి పేర్కొన్నారు. ఉమ్మడి జాతీయ మార్కెట్ ఏర్పాటుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న నమ్మకంతో రాష్ట్రాలు తమ స్వతంత్ర పన్ను విధించే అధికారంలో గణనీయమైన భాగాన్ని వదులుకు న్నాయని గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాలు భాగ స్వాములుగా పని చేయడం, రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడటం, కీలక మార్పులను సం ప్రదింపులు, ఏకాభి ప్రాయంతో చేపట్టడం ఈ వ్యవస్థకు మూల సూత్రాలని అన్నారు. తెలంగాణపై జీఎస్టీ ప్రభావం తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35 శాతం ఉందని భట్టి తెలిపారు. ఈ ఆదాయంతోనే రాష్ట్రంలో పాఠశాలలు, ఆసుపత్రులు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపా యాలకు నిధులు మకూరుతున్నాయని చెప్పారు. జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల కేవలం లెక్కల అంశం కాదని, ప్రజలకు సేవలు అందించే రాష్ట్ర సామర్థ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

మోటార్ వాహనాలు, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌పుట్ సర్వీసుల రీఫండ్‌లకు సంబంధించిన మార్పులు చేపట్టే ముందు వాటి పూర్తి ఆర్థిక ప్రభావాన్ని రాష్ట్రాలకు వివరించాలని కోరారు. మోటార్ వాహనాల విషయంలో కేంద్రం అందించిన అంచనాల ప్రకారం తెలంగాణకు ఏడాదికి సుమారు రూ.800 కోట్ల ఆదాయ ప్రభావం ఉంటుందని, రాష్ట్ర సొంత అంచనాల ప్రకారం ఈ నష్టం అంతకంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. తగిన సందర్భాల్లో ఆటోమేటిక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ మార్పులు, రద్దు దరఖాస్తుల ఆటోమేటిక్ ప్రాసెసింగ్‌కు భట్టి మద్దతు తెలిపారు. రిస్క్ లేని కేసుల్లో ఆటోమేటిక్‌గా రీఫండ్‌లు మంజూరు చేయడం ద్వారా నిజాయితీగల పన్నుదారులకు త్వరగా ప్రయోజనం అందుతుందని అన్నారు. అదే సమయంలో అధిక రిస్క్ ఉన్న కేసులపై పన్ను అధికారులు మరింత దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పెనాల్టీలను హేతుబద్ధీకరించడం, రహదారులపై సరుకుల వాహనాలను యాదృచ్ఛికంగా నిలిపివేయడాన్ని తగ్గించడం వంటి చర్యలను స్వాగతించారు. జీఎస్టీ రిటర్నుల్లో అవసరమైన మార్పులు చేసి పన్ను వివరాల్లో తేడాలను తగ్గించాలని, నిజాయితీగల పన్నుదారులకు అనవసర నోటీసులు జారీ కాకుండా చూడాలని సూచించారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం తగిన సర్క్యులర్లు, వివరణలు జారీ చేయాలని కోరారు.


నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
పన్నుదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేయడంతో పాటు జీఎస్టీ మోసాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, గుర్తింపు వివరాల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. వృద్ధులు, గృహిణులు, రోజువారీ కూలీలు, ఇతర అమాయకుల ఆధార్, పాన్ వివరాలను దుర్వినియోగం చేసి మోసపూరిత జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సృష్టిస్తున్న ఘటనలను ప్రస్తావించారు. నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించడం, అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడం లేదా ఇతరులకు బదిలీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, వ్యవస్థీకృత ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విధానాలను సరళీకరించడం పేరుతో వ్యవస్థీకృత పన్ను ఎగవేతపై అమలు చర్యలు బలహీనపడకూడదని స్పష్టం చేశారు.


స్క్రాప్ రంగంపై ప్రత్యేక దృష్టి
దేశవ్యాప్తంగా స్క్రాప్ రంగంలో జరుగుతున్న పన్ను ఎగవేతను భట్టి ప్రస్తావించారు. అసంఘటిత, నగదు ఆధారిత వ్యవస్థ కారణంగా నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించడం, నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ బదిలీ చేయడం జరుగుతోందని చెప్పారు. అదే సమయంలో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న చెత్త సేకరించే కార్మికులు, చిన్న స్థాయి సేకరణదారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.స్క్రాప్ రంగం, గుర్తింపు దొంగతనం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, పేద ప్రజల ప్రయోజనాలను కాపాడే కార్యాచరణను రూపొందించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రతిపాదించింది. దేశంలో అత్యంత చురుకైన పన్ను ఆధారాల్లో తెలంగాణ ఒకటని భట్టి అన్నారు. అయితే చాలా కాలంగా అధికారుల కమిటీల్లో తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ పునర్వ్యవస్థీకరించే కమిటీల్లో తెలంగాణకు సభ్యత్వం కల్పించాలని కోరారు. స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్‌లోనూ తెలంగాణకు ప్రాతినిధ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


హైదరాబాద్‌లో జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాలు
హైదరాబాద్ కేవలం భౌగోళికంగా అనుకూలమైన నగరం మాత్రమే కాదని, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశంలోని ప్రముఖ కేంద్రాల్లో ఒకటని భట్టి పేర్కొన్నారు. భవిష్యత్ జీఎస్టీ పరిపాలనకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ సెక్రె టేరియట్‌కు హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల జీఎస్టీ పరిపాలన రాష్ట్రాలకు మరింత చేరువ కావడంతో పాటు, సాంకేతికత ఆధారిత పన్ను మోసాల గుర్తింపు వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు సరుకుల వాహనాల తనిఖీల విషయంలో ప్రస్తుతం ఉన్న అధికారాలను మూల రాష్ట్రం, గమ్య రాష్ట్రం రెండింటికీ కొనసాగించాలని తెలంగాణ సూచించింది. పన్ను ఎగవేతను అరికట్టడంతో పాటు, వ్యాపార కార్యకలాపాలకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా సమతుల్య విధానం అవసరమని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ వంటి ఎగుమతి రాష్ట్రాల సహకారాన్ని గుర్తించాలని భట్టి కోరారు. పోటీతో కూడిన ఎగుమతి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలు, ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుబడులు పెట్టే రాష్ట్రాలకు తగిన మద్దతు, ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్సులలో రాష్ట్రాలకు నిర్దిష్టమైన, పారదర్శక వాటా కల్పించాలని కోరారు. జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతిమంగా కేంద్రానిదీ, రాష్ట్రాలదీ కాదని.. అది భారత ప్రజలకు చెందినదని భట్టి పేర్కొన్నారు. ప్రజలపై ఉన్న బాధ్యతను గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. “నిజాయితీగల పన్నుదారులకు అనుసరణ ప్రక్రియను సులభతరం చేయడం.. ఉద్దేశపూర్వక పన్ను మోసాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగించడం.. ఈ రెండూ సమాంతరంగా సాగాలి” అని భట్టి స్పష్టం చేశారు. ప్రజలు కేంద్రం, రాష్ట్రాలపై ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా జీఎస్టీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్