Magazines

సర్‌ పేరుతో ఓటర్ల వేట

1 గంట క్రితం

Voter hunting
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 3 నిమిషాల చదవడం

70 లక్షల ఓట్లకు లెక్కేది?
దేశవ్యాప్తంగా 13.37 కోట్ల పేర్ల తొలగింపు

అర్హులైన ఓటర్ల హక్కులపై 
తీవ్ర సందేహాలు

పశ్చిమ బెంగాల్‌లోనే 
40-60 లక్షల మంది

అప్పీళ్ల పరిష్కారంలో జాప్యం

ఎన్నికల సంఘం తీరుపై ప్రశ్నలు


న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది పేర్లను తొలగించిన ఎన్నికల సంఘం తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముసాయిదా జాబితాల నుంచి 13.37 కోట్ల పేర్లు తొలగించగా.. తుది జాబితాలు వెలువడిన రాష్ట్రాల్లోనే సుమారు 70 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపునకు సరైన వివరణ లేదనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడమనే పేరుతో ఆ ప్రక్రియలో అర్హులైన పౌరుల ఓటు హక్కు దెబ్బతింటే బాధ్యత ఎవరిది? కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే వ్యక్తమవుతున్న అనుమానాల మధ్య, సర్‌ నిర్వహణ తీరు ఎన్నికల సంఘం పారదర్శకతను మరోసారి ప్రశ్నార్థకం చేస్తోంది.

తొలగింపుల లెక్కల్లో అంతులేని సందేహాలు

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. సర్‌ మూడు దశల్లో 13.37 కోట్ల పేర్లు తొలగించారు. వీరిలో 2.8 కోట్ల మంది మరణించినవారు, 6.3 కోట్ల మంది నివాసాలు మార్చినవారు, కోటి మంది నకిలీ లేదా పునరావృత నమోదులుగా గుర్తించినవారు. మరో మూడు కోట్ల మంది ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ ముసాయిదా జాబితాల దశలో నమోదైన తొలగిం పులు. ఈ సంఖ్యల ఆధారంగా అర్హులైన ఓటర్లను ఎంతమందిని తొలగించారో తేల్చలేం. అదే సమయంలో, ఇంత భారీ స్థాయిలో పేర్లు తొలగించి నప్పుడు ప్రతి ఓటరుకు న్యాయం జరిగిందా లేదా అన్నది నిర్ధారించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. కేవలం గణాంకాలు ప్రకటించడం సరిపోదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

70 లక్షల ఓటర్లపై ఎందుకీ అనిశ్చితి?

2026 మధ్య నాటికి దేశంలో 18 ఏండ్లు పైబడినవారి సంఖ్య 100.8 కోట్లుగా అంచనా. ఓటర్లుగా నమోదు కానివారిని కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే, దేశంలో సరైన ఓటర్ల జాబితాలో సుమారు 92.2 కోట్ల పేర్లు ఉండాలి. తుది జాబితాలు వెలువడిన తొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో ఈ అంచనాలను వర్తింపజేయగా.. ఉండాల్సిన పేర్లకు, వాస్తవంగా ఉన్న పేర్లకు మధ్య సుమారు 73 లక్షల తేడా కనిపించింది. అర్హత లేని విదేశీయుల తొలగింపునకు అంచనా వేసిన ఐదు లక్షలను మినహాయిస్తే.. దాదాపు 70 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపునకు వివరణ లేదని లెక్కలు సూచిస్తున్నాయి. ఇది అధికారిక లెక్క కాదు.. అందుబాటులో ఉన్న జనాభా, ఓటర్ల నమోదు వివరాల ఆధారంగా చేసిన అంచనా. అయినప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో పేర్లపై సందేహాలు వ్యక్తమవుతుండటం ఎన్నికల సంఘం ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

బీహార్‌లో భిన్నమైన లెక్కలు

బీహార్‌లో మాత్రం సరైన జాబితాలో ఉండాల్సి న సంఖ్య కంటే సుమారు 60 లక్షల పేర్లు ఎక్కు వగా ఉన్నాయని అంచనా. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పనిచేస్తున్నవారు బీహార్‌లోనూ ఓటర్లుగా నమోదై ఉండటం ఇందుకు ఒక కారణంగా కనిపి స్తోంది. అంటే, ఒకవైపు పేర్లు అవసరానికి మించి ఉన్నాయనే అంచనాలు, మరోవైపు అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయాయనే సందేహాలు కనిపిస్తు న్నాయి. రాష్ట్రాలవారీగా భిన్నమైన పరిస్థితులు ఉన్న ప్పుడు, ఒకే విధమైన కఠిన ప్రక్రియను అమలు చేయడంలో ఎన్నికల సంఘం మరింత జాగ్రత్త వహించాల్సి ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ప్రక్షాళన పేరుతో హక్కులకు భంగం

గతంలోనూ ఓటర్ల జాబితాల్లో తేడాలు ఉన్నాయి. 2004లో వయోజన జనాభా అంచనా కంటే 2.8 కోట్ల పేర్లు ఎక్కువగా ఉండగా, 2014లోనూ 3.1 శాతం అధికంగా నమోదయ్యాయి. కానీ, గతంలో లోపాలు ఉన్నాయన్న కారణంతో ప్రస్తుత తొలగింపులపై ప్రశ్నలను తోసిపుచ్చలేమనీ, పేదలు, వలస కార్మికుల నుంచి పత్రాలు కోరడం, వేగంగా సవరణ చేపట్టడం, ‘తార్కిక వ్యత్యాసాల’ పేరుతో పేర్లు తొలగించడం వంటి అంశాలు ఇప్పటికే విమర్శలకు దారితీశాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.


ఈసీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి
మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల వ్యవస్థపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో, ఎన్నికల సంఘం స్వతంత్రత, నిష్పాక్షికతపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టుకోవడం మరింత కీలకమని అంటున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు ఎందుకు తొలగించబడ్డాయో వివరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందనీ, ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి తప్ప, అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితిని సృష్టించకూడదని సూచిస్తున్నారు.


బెంగాల్‌లో ఓటర్ల హక్కులకు గండి?

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు పడిపోయింది. అంటే 11.6 శాతం తగ్గింది. రాష్ట్రంలో సరైన జాబితాలో సుమారు 56 లక్షల పేర్లు అవసరానికి మించి తొలగించినట్టు కనిపిస్తోంది. అర్హులైన 40 లక్షల నుంచి 60 లక్షల మంది ఓటర్ల పేర్ల తొలగింపుపై సందేహాలున్నాయి. ‘తార్కిక వ్యత్యాసాలు’ ఉన్నాయని గుర్తించిన 60 లక్షల మందిలో 27 లక్షల పేర్లను న్యాయాధికారులు తొలగించారు. వీరిలో దాదాపు మూడింట రెండొంతుల మంది ముస్లింలే కావడం గమనార్హం. తొలగించిన పేర్లను తిరిగి చేర్చాలని కోరుతూ 22.2 లక్షల అప్పీళ్లు దాఖలయ్యాయి. అప్పటికి పరిష్కరించిన 1.3 లక్షల అప్పీళ్లలో సుమారు 93 శాతం మంది అర్హులేనని తేలడం గమనార్హం. అయితే, ఇంత తక్కువ అప్పీళ్లే పరిష్కారమైతే మిగిలిన ఓటర్ల పరిస్థితి ఏమిటి? తమ పేర్లు తొలగించబడినట్టు తెలియని వారు తమ హక్కును ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి ఉందనే డిమాండ్లు గట్టిగా వినబడుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్