ముంబయిలో నిరసనకారుల నిర్బంధంపై హైకోర్టు ఆగ్రహం
ముంబయి : ఎన్నికల సంఘం పనితీరుపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై నిరసన తెలిపిన వారిని పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని అనుమతించబోమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ముంబయిలో నిరసనకారులతో పాటు ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న సాధారణ ప్రజలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా శనివారం జరిగిన ఆందోళనల్లో సుమారు 600 మందిని, ఆదివారం మరో 300 మందిని పోలీసులు నిర్బంధించారు. ఆదివారం శివాజీ పార్కు సమీపంలో నిరసనకారులు గుమిగూడేందుకు పోలీసులు అనుమతించలేదని, దాదర్ రైల్వే స్టేషన్ వద్ద పలువురిని అదుపులోకి తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్న కొందరిని సైతం నిర్బంధించినట్టు పేర్కొన్నారు. గత జులైలో యువత నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులను పోలీసులు వారి ఇండ్ల నుంచే తీసుకెళ్లారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని, సాధారణంగా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లిన వారిని సరైన వ్యక్తిగత కారణాలు లేకుండా విచక్షణారహితంగా నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి స్పందిస్తూ.. “ఈ సమస్యను మేము పరిశీలిస్తాం. అయితే, ఇలాంటి అక్రమ నిర్బంధాలను మాత్రం అనుమతించబోం” అని స్పష్టం చేశారు. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.






కామెంట్లు (0)