Magazines

ఈ-వ్యర్థాల లెక్కల్లో లేని కార్మికులు

3 గంటల క్రితం

E-waste Statistics
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 4 నిమిషాల చదవడం

టన్నుల కొద్దీ వ్యర్థాల లెక్కలున్నాయి..

రీసైక్లింగ్‌ సర్టిఫికెట్లకూ కొరత లేదు..

కానీ వాటిని సేకరించి, విడదీసి, విలువైన లోహాలను
 వెలికితీసే కార్మికుల జీవితాలకు గుర్తింపు కరువు


దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈ-వ్యర్థాల సమస్య తీవ్రమవుతోంది. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్‌ పేరుతో ప్రభుత్వాలు లక్ష్యాలు నిర్దేశిస్తున్నా.. ఈ వ్యర్థాలను నిర్వహించే అసంఘటిత రంగ కార్మికుల శ్రమ, ఆరోగ్యం, ఆదాయంపై మాత్రం సరైన లెక్కలు లేవు. ఉత్పత్తిదారుల బాధ్యత నుంచి ప్రభుత్వ విధానాల వరకు ప్రతిచోటా కనిపిస్తున్న ఈ లోటు.. వ్యర్థాల నిర్వహణలో కార్మికుల హక్కులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


న్యూఢిల్లీ: చెవిలో పెట్టుకునే ఇయర్‌ఫోన్లు, ఛార్జింగ్‌ కేబుళ్లు, యూఎస్‌బీ అడాప్టర్లు, ఎల్‌ఈడీ లైట్లు, చిన్న ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్‌ బొమ్మలు.. కొద్దిపాటి ధరకు లభిస్తున్న ఈ వస్తువులు పాడైతే చాలామంది నిర్లక్ష్యంగా పాడేస్తున్నారు. కానీ అవి అక్కడితో అంతరించిపోవు. వాటిని సేకరించి, విడదీసి, రాగి వంటి లోహాలను వెలికితీసి అమ్మే కార్మికుల చేతుల్లోకి చేరతాయి. ఢిల్లీలోని సీలంపూర్‌, ముస్తఫాబాద్‌ ప్రాంతాల్లో వేలాది మంది ఇలాంటి పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే దేశంలో ఈ-వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తున్నది వ్యర్థాల పరిమాణమే తప్ప..వాటి వెనుక ఉన్న కార్మికుల శ్రమ, కష్టాలు, ఆరోగ్య సమస్యలు కాదు.

కార్మికుల జీవితాల్లో కనిపించని మార్పు

'ది వైర్‌' కథనం ప్రకారం...అక్టోబర్‌ 14న అంతర్జాతీయ ఈ-వ్యర్థాల దినోత్సవం సందర్భంగా ఈ సమస్యపై చర్చ మరోసారి ముందుకొచ్చింది. ఈ ఏడాది ప్రధానంగా తక్కువ ధరకు లభించి, త్వరగా పాడైపోయి పడేయబడే చిన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దృష్టి సారించారు. సాంకేతికత వేగంగా మారుతున్నా, ఆ మార్పు వల్ల ఏర్పడే వ్యర్థాలను నిర్వహించే కార్మికుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. 2024-25లో భారత్‌లో సుమారు 13.98 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తయ్యాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గతేడాది జులైలో పార్లమెంటుకు తెలిపింది. ఇందులో 70.71 శాతం సేకరణ, విడదీయడం, రీసైక్లింగ్‌, ఇతర పద్ధతుల ద్వారా నిర్వహించినట్టు పేర్కొంది. అయితే 2024 ఆగస్టులో రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో అసంఘటిత రంగం ద్వారా ఎంత శాతం ఈ-వ్యర్థాలు నిర్వహణకు గురవుతున్నాయో తమ వద్ద అంచనా లేదని అదే శాఖ వెల్లడించింది. అంటే వ్యర్థాల నిర్వహణలో అనధికారిక రంగం వాటా ఎంత? అందులో పనిచేసే కార్మికులు ఎంతమంది? వారి ఆదాయం ఎంత? అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) దేశవ్యాప్తంగా నమోదైన ఉత్పత్తిదారులు అందించే అమ్మకాల వివరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల సగటు జీవితకాలం ఆధారంగా వ్యర్థాల ఉత్పత్తిని అంచనా వేస్తోంది. అయితే ఆన్‌లైన్‌ వేదికలు, నమోదు కాని విక్రేతల ద్వారా అమ్ముడవుతున్న చిన్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల లెక్కలు ఇందులో ఎంతవరకు చేరుతున్నాయన్నది స్పష్టం కావాల్సి ఉంది.

ఈపీఆర్‌ సర్టిఫికెట్ల ధరల పైనా వివాదం

ఈపీఆర్‌ సర్టిఫికెట్ల ధరలపైనా వివాదం కొనసాగుతోంది. సంబంధిత విభాగంలో కిలో ఈ-వ్యర్థాలకు సర్టిఫికెట్‌ కనీస ధరను రూ.22గా సీపీసీబీ నిర్ణయించింది. ఈ ధరల విధానాన్ని సామ్‌సంగ్‌, ఎల్‌జీ వంటి సంస్థలు 2025లో కోర్టులో సవాలు చేశాయి. గతేడాది డిసెంబరులో బ్లూ స్టార్‌ సంస్థకు సంబంధించిన వివాదంలో ఢిల్లీ హైకోర్టు కనీస ధరల ప్రకటనపై సీపీసీబీ విధించిన కొత్త నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసింది. అంతకుముందు జాన్సన్‌ కంట్రోల్స్‌-హిటాచీ నిర్వహించిన వేలంలో కిలోకు రూ.5.90 వంటి తక్కువ ధరలకు బిడ్లు వచ్చాయి. అయితే ఈ ధరలు కార్మికుల కూలీకి సంబంధించినవి కావు. ఇవి ఉత్పత్తిదారులు రీసైక్లింగ్‌ బాధ్యతను నెరవేర్చేందుకు చెల్లించే సర్టిఫికెట్ల ధరలు మాత్రమే. ఆ డబ్బులో కార్మికులకు ఎంత అందుతోంది? వారి భద్రతకు ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న అంశాలపై స్పష్టమైన విధానం అవసరం. సర్టిఫికెట్‌ ధర పెరిగితేనే కార్మికుల ఆదాయం పెరుగుతుం దనుకోవడం కూడా సరికాదని నిపుణులు చెప్తున్నారు.

ప్రమాద పరిస్థితులను కారణంగా చూపుతూ ఉపాధిని దెబ్బ తీయొద్దు

ఈ-వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం, ఆమ్లాలతో లోహాలను వేరు చేయడం, రక్షణ లేకుండా పరికరాలను విడదీయడం వల్ల గాలి, నేల, నీరు విషపూరితమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది. చిన్న పరికరాల్లో ఉండే లిథియం-అయాన్‌ బ్యాటరీలను నలిపినా, పగులగొట్టినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. గత ఏడాదిలో తమ కేంద్రాల్లో బ్యాటరీల కారణంగా మంటలు ఎదుర్కొన్నట్టు 36 శాతం ఈ-వ్యర్థాల నిర్వహణ సంస్థలు తెలిపినట్టు డబ్ల్యూఈఈఈ ఫోరం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు ఉపాధి కావాలా, ఆరోగ్యం కావాలా అనే పరిస్థితి ఉండకూడదు. ప్రమాదకర పరిస్థితులను అరికట్టాలనే పేరుతో వారి ఉపాధిని దెబ్బతీయడమూ పరిష్కారం కాదు. భద్రతా శిక్షణ, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన చికిత్స, రక్షణ పరికరాల ఖర్చును ఉత్పత్తిదారుల బాధ్యతలో భాగం చేయాలి. కార్మికులకు అందుతున్న సేవలపై ప్రభుత్వాలు క్రమం తప్పకుండా వివరాలు ప్రకటించాలి. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను గుర్తించడమే కాకుండా, చికిత్స కూడా అందించాలని మేధావులు సూచిస్తున్నారు.

'విధానాల రూపకల్పనలో కార్మికుల భాగస్వామ్యం ఉండాలి'

వ్యర్థాలను సేకరించే కార్మిక సంఘాలు, సహకార సంఘాలను గుర్తించి, నమోదైన రీసైక్లర్లతో నేరుగా ఒప్పందాలు చేసుకునే అవకాశం కల్పించాలి. పారదర్శకమైన చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, విధానాల రూపకల్పనలో కార్మికుల భాగస్వామ్యం ఉండాలి. పూణేలోని 'స్వాచ్‌' కార్మికుల సహకార సంఘం చెత్త సేకరణలో కార్మికులను వ్యవస్థలో భాగం చేసుకోవచ్చని చూపుతోంది.ఇది ఈ-వ్యర్థాల ఈపీఆర్‌ నమూనా కాకపోయినా, కార్మికులను పక్కకు నెట్టకుండా నిర్వహణలో భాగస్వాములను చేయవచ్చని నిరూపిస్తోంది. ఇక రీసైక్లింగ్‌తోపాటు పరికరాల మరమ్మతులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. విడిభాగాలు, మరమ్మతులకు అవసరమైన సాంకేతిక సమాచారం అందుబాటులో ఉంటే పాడైన పరికరాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వ్యర్థాలు తగ్గడమే కాకుండా, మరమ్మతులు చేసే నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


కార్మికులకు న్యాయమైన వాటాపై లేని హామీ

మరోవైపు, ఈ-వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2022 ప్రకారం ఉత్పత్తిదారులు తమ విస్తరించిన ఉత్పత్తిదారుల బాధ్యత (ఈపీఆర్‌)ను నమోదైన రీసైక్లర్ల ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్లతో నెరవేర్చుకోవచ్చు. 2023-24, 2024-25 సంవత్సరాలకు 60 శాతం, 2025-26, 2026-27కు 70 శాతం, 2027-28 నుంచి 80 శాతం రీసైక్లింగ్‌ లక్ష్యాలను నిర్దేశించారు. అయితే ఈ వ్యవస్థలో అసంఘటిత రంగ కార్మికులు పూర్తిగా భాగస్వాములు కావడం లేదు. నమోదైన రీసైక్లర్లు వారి నుంచి వ్యర్థాలను కొనుగోలు చేసినా, ఆ వివరాలను రశీదుల్లో నమోదు చేసినా.. ఆ కార్మికులకు ఈపీఆర్‌ ద్వారా వచ్చే ఆదాయంలో న్యాయమైన వాటా అందుతుందనే హామీ లేదు. లోహాలు, వ్యర్థాల లెక్కలు నమోదవుతున్నాయి. కానీ వాటిని సేకరించిన వ్యక్తికి సరైన ధర లభించిందా? పని చేసే చోట భద్రత ఉందా? అనారోగ్యానికి గురైతే చికిత్స పొందగలుగుతున్నాడా? అనే అంశాలకు మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్