Magazines

జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డు

19 నిమిషాల క్రితం

Award
avatar
balaji

ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న మంత్రి పొన్నం


నవతెలంగాణ-సిటీబ్యూరో/న్యూఢిల్లీ బ్యూరో

​స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జాతీయ అవార్డు అందుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఏంసీ అదనపు కమిషనర్‌ (‌పారిశుధ్యం, ఆరోగ్యం) ఎన్‌.రవికిరణ్‌ అవార్డును స్వీకరించారు.

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు లభించింది. నగరంలో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం వంటి పది ప్రధాన అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జీహెచ్‌ఎంసీ తన పనితీరును ప్రదర్శించింది.

స్వచ్ఛతలో హైదరాబాద్ ప్రస్థానం..

- 2017లో హైదరాబాద్‌కు ఓడీఎఫ్ హోదా లభించింది.

- 2019లో ఓడీఎఫ్++ హోదా సాధించింది.

- 2021లో తెలంగాణలోనే తొలిసారిగా వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన స్థానిక సంస్థగా జీహెచ్‌ఎంసీ గుర్తింపు పొందింది.

- 2023, 2024 సంవత్సరాల్లోనూ వాటర్ ప్లస్ హోదాను కొనసాగించింది.

- 2024 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో హైదరాబాద్ 6వ ర్యాంకు సాధించింది.

- 2023లో 5 స్టార్, 2024లో 7 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ గుర్తింపు పొందింది.

10,500 మార్కులతో మూల్యాంకనం..

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా మొత్తం 10,500 మార్కులతో పది ప్రధాన విభాగాల్లో నగరాలను అంచనా వేశారు. కనిపించే పారిశుధ్యం, చెత్త వేరు చేయడం, సేకరణ, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య సదుపాయాలు, వినియోగించిన నీటి నిర్వహణ, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, పౌరుల అభిప్రాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.

​మంథని, చేర్యాల మున్సిపాలిటీలకు మెంటార్‌గా జీహెచ్‌ఎంసీ

స్వచ్ఛ షెహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఏంసీ మెంటార్ సిటీగా మంథని, చేర్యాల మున్సిపాలిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు, సామర్థ్య పెంపు వర్క్‌షాప్‌లు నిర్వహించింది.

​క్షేత్రస్థాయి పరిశీలన..

2026 ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ జంట నగరాల్లో మూడో పక్షం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, పారిశుధ్య మౌలిక సదుపాయాలు, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఇంటింటి చెత్త సేకరణతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డు లభించడం హైదరాబాద్ నగర ప్రజలకు, అధికారులకు, పారిశుధ్య కార్మికులకు గర్వకారణమని అధికారులు తెలిపారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్