Magazines

ఎరువుల సబ్సిడీకి రూ.62,370 కోట్లు

15 నిమిషాల క్రితం

fertilizer
avatar
balaji

ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం

సూక్ష్మ పరిశ్రమలకు క్రెడిట్‌ గ్యారెంటీ నిధులు రూ.5 వేల కోట్లు

నోయిడా మెట్రో విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

యుగే యుగేన్ భారత్ మ్యూజియం నిర్మాణానికిరూ.3,230 కోట్లు

‘స్టాండ్ అప్ ఇండియా’ కు రూ.4,111 కోట్లు : కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలు

కేంద్ర మంత్రి వర్గం ఆమోదం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎరువుల సబ్సిడీ, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక చేయూత తదితర అంశాలపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రబీ 2026–27 సీజన్‌కు ఎరువుల సబ్సిడీకి రూ.62,370 కోట్లు కేటాయించారు. ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం నిర్మాణానికి రూ.3,230 కోట్లు, నోయిడా–గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణకు రూ.2,390 కోట్లు మంజూరు చేశారు. సూక్ష్మ పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.5,000 కోట్లు, స్టాండ్ అప్ ఇండియా పథకం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌కు రూ.4,111 కోట్లను ఆమోదించారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) అమలు

రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి 2026 అక్టోబర్‌ 1 నుంచి 2027 మార్చి 31 వరకు పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) అమలుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ‌డీఏపీ, ఎన్‌‌పీకేఎస్‌ తదితర భాస్వరం, పొటాష్‌ ఎరువులకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. గత రబీ సీజన్‌తో పోలిస్తే ఈసారి సుమారు రూ.24,417 కోట్ల అదనపు నిధులను కేటాయిం చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువులు, ముడి పదార్థాల ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు.

సూక్ష్మ పరిశ్రమలకు ఐదేండ్లపాటు రుణ చేయూత

సూక్ష్మ పరిశ్రమలకు రుణ సదుపాయాలు కల్పించే క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ ఫర్‌ మైక్రో యూనిట్స్‌ (సీజీఎఫ్ఎంయూ) పథకాన్ని 2031 మార్చి 31 వరకు కొనసాగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.5,000 కోట్ల నిధిని కేటాయించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద అర్హత కలిగిన సూక్ష్మ సంస్థలకు పూచీకత్తు లేని రుణాలు అందించేందుకు ఈ నిధి ఉపయోగపడనుంది. అర్హత కలిగిన ముద్ర రుణాలపై గ్యారెంటీ రుసుమును ఏడాదికి ఒక శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించారు.

స్టాండ్‌ అప్‌ ఇండియా పథకానికి కొనసాగింపు

స్టాండ్‌ అప్‌ ఇండియా పథకాన్ని 2031 మార్చి 31 వరకు కొనసాగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.4,111 కోట్ల క్రెడిట్‌ గ్యారెంటీ నిధికి ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేండ్లలో అదనంగా 2.5 లక్షల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా అర్హులైన పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం.

నార్త్‌, సౌత్‌ బ్లాక్‌లలో భారీమ్యూజియం

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక నార్త్‌ బ్లాక్‌, సౌత్‌ బ్లాక్‌ భవనాలను యుగే యుగీన్‌ భారత్‌ మ్యూజియంగా అభివృద్ధి చేయడానికి రూ.3,230 కోట్లు కేటాయించారు. సుమారు 1,78,509 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియాన్ని నిర్మించనున్నారు. దేశ నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా వివిధ గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు. 2026–27 నుంచి 2030–31 వరకు దశలవారీగా పనులు చేపట్టనున్నారు. 2027 ద్వితీయార్థంలో తొలి గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్