వీబీ-గ్రామ్ జీ చట్టం కింద ఫిర్యాదుల పరిష్కార నిబంధనలు జారీ
ఏడు పనిదినాల్లో విచారణ పూర్తి.. పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవస్థ
నిబంధనలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నోటిఫై
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గ్రామీణ ఉపాధి పథకం అమలులో తలెత్తే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ ఆర్ఏఎం జీ) చట్టం కింద ఫిర్యాదుల పరిష్కార నిబంధనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఫిర్యాదు అందిన ఏడు పనిదినాల్లో విచారణ పూర్తి చేసి, 15 రోజుల్లో పరిష్కరిం చాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులో పరిష్కారం కాని ఫిర్యాదులను తదుపరి ఉన్నతస్థాయి అధికారులకు పంపించనున్నారు.
మూడు అంచెల్లో ఫిర్యాదుల పరిష్కారం
గ్రామ పంచాయతీ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా స్థాయిల్లో నియమితులైన ఫిర్యాదుల పరిష్కార అధికారులు ఫిర్యాదులను స్వీకరించడం, నమోదు చేయడం, విచారణ జరపడం, పరిష్కరించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో ఈ ప్రక్రియను జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తారు.
ఫిర్యాదు చేయడానికి మార్గాలు
పథకం అమలుకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం సంబంధిత అధికారికి నేరుగా ఫిర్యాదు అందజేయడం, రసీదుతో కూడిన స్పీడ్ పోస్టులో పంపించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజిటల్ వేదికను వినియోగించడం, టెలిఫోన్, ప్రత్యేక హెల్ప్లైన్లతో ఫిర్యాదు చేయడం వంటి అవకాశాలు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే ఇతర మార్గాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించవచ్చు. గ్రామ పంచాయతీ, బ్లాక్, జిల్లా కార్యాలయాల్లో భౌతికంగా అందిన ఫిర్యాదులను అదే రోజు లేదా సాధ్యం కానిపక్షంలో మరుసటి పనిదినం డిజిటల్ వేదికపై నమోదు చేయాలి. ఫిర్యాదుదారులకు రిజిస్ట్రేషన్ నంబరు, ఫిర్యాదు అందిన తేదీ, స్వీకరించిన అధికారి వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలి. ఫిర్యాదు ఏ భాషలో ఉన్నా, ఏ రూపంలో సమర్పించినా, ఏ విధంగా అందించినా నమోదు చేయాల్సిందేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. విధాన పరమైన లోపాలను సాకుగా చూపి ఫిర్యాదును తిరస్కరించడానికి వీల్లేదని పేర్కొన్నాయి.
ఏడు రోజుల్లో విచారణ.. 15 రోజుల్లో పరిష్కారం
ఫిర్యాదు అందిన తరువాత సంబంధిత అధికారి విచారణ ప్రారంభించాలి. అవసరమైన రికార్డులు, రిజిస్టర్లు, పత్రాలు, నివేదికలు, ఎలక్ట్రానిక్ సమాచారాన్ని సంబంధిత అధికారుల నుంచి తెప్పించు కోవచ్చు. అవసరమైతే ఫిర్యాదుదారుడికి నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా తన వాదన వినిపించే అవకాశం కల్పించాలి. విచారణను ఏడు పనిదినాల్లో పూర్తి చేసి, ఫిర్యాదు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా పరిష్కరించాలి. విచారణలో తేలిన అంశాలు, తీసుకున్న చర్యలను డిజిటల్ వేదికలో నమోదు చేసి ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి.
పరిష్కారం కాకుంటే ఉన్నతస్థాయికి బదిలీ
నిర్ణీత 15 రోజుల గడువులో పరిష్కారం కాని ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థలో తదుపరి ఉన్నత స్థాయికి పంపించాలి. పరిష్కారం అయ్యేంత వరకు వాటిని డిజిటల్ విధానంలో పర్యవేక్షించాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధికారులు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. వీబీ-జీ ఆర్ఎఎం జీ చట్టం-2025లోని షెడ్యూల్-1 ప్రకారం అప్పీళ్ల దాఖలు, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామీణ ఉపాధి చట్టం అమలులో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనం పెంచడం, ప్రజల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపడం ఈ నిబంధనల లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పేర్కొంది.





కామెంట్లు (0)