శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు : ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడల పోటీల ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ)లో ఇదే అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే దీర్ఘ కాలిక లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి క్రీడా శిక్షణను తెలంగాణ యువ క్రీడాకారులకు అందించేందుకు ఈ పోటీలను ఒక గొప్ప అవకాశంగా మలుచుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేళో ఇండియా పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో క్రీడలు, క్రీడాభివృద్ధికి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణ కూడా ఒక భాగం అయినందున అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. యువతలో దాగున్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్ది ఖేలో ఇండియా పోటీల తర్వాత కూడా అవి గొప్ప క్రీడా వనరులుగా ఉపయోగపడేలా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకునే విధంగా గ్రూప్-1 స్థాయి అధికారులకు ఏర్పాట్ల నుంచి క్రీడలు ముగీసే వరకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించాలన్నారు. వివిధ జిల్లాల్లో జరగనున్న పోటీలకు సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఆయా చోట్ల స్థానికంగా పనిచేస్తున్న ట్రైనీ అధికారులు, గ్రూప్-1 అధికారులను నియమించాలని సూచించారు. క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. ప్రతి వారం ఏర్పాట్ల పురోగతిపై సమాచారమివ్వాలని సీఎం ఆదేశించారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా పోటీల్లో జరిగిన పరిణామాలు నివృత్తి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసీఆర్ పాలనలో క్రీడలకు కొన్ని చోట్ల చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు క్రీడా పోటీలు ముగిసిన కొన్నేళ్ళలోనే విచ్ఛిన్నం అయ్యాయని గుర్తు చేశారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో క్రీడా పోటీల ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.
కాగా ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు పాల్గొంటారు. ఏడు వేల మందికి పైగా యువ క్రీడాకారులతో పాటు సుమారు రెండు వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ సహా 6 నగరాల్లో 20 చోట్ల 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. తెలంగాణ కర్రసాము క్రీడను కూడా ఆతిధ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చే విధంగా వెంటనే కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు సత్తా చాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని ఖేలో ఇండియా శిబిరాల్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. పోటీల నిర్వహణ కోసం 20 వేదికల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై వారు సీఎంకు వివరించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)