Magazines

ఐడీబీఐని అమ్మడం దేశద్రోహమే

1 గంట క్రితం

Selling IDBI is an act of treason.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం
ప్రభుత్వ బ్యాంకులు దేశాన్ని నిర్మించే సాధనాలు : 
ఏఐబీఈఏ జాతీయ అధ్యక్షులు బిఎస్ రాంబాబు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఐడీబీఐ బ్యాంకును అడ్డగోలుగా అమ్మడం దేశద్రోహమే‌నని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబిఈఏ) జాతీయ అధ్యక్షులు బి.ఎస్. రాంబాబు విమర్శించారు. ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, పార్లమెంటరీ పర్యవేక్షణలో సమగ్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ ఐడీబీఐ అధికారులు, ఉద్యోగుల ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ ‌లోని ధర్నా చౌక్‌ ‌వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఐడీబీఐ అధికారులు, ఉద్యోగులు, ప్లకార్డులు చేతబూని ఐడీబీఐ ప్రవేటీకరణను తక్షణమే ఆపాలని, దేశ సంపదను రక్షించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. రెండు రోజుల నిరాహార దీక్ష శిబిరాన్ని బి.ఎస్. రాంబాబు ప్రారంభిస్తూ లక్ష కోట్లకు పైగా విలువన్న ఐడీబీఐ బ్యాంకును కేవలం రూ. 52,878 కోట్ల ప్రతిఫలంతో 60.72శాతం వాటాను అమ్మడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకులు అమ్ముకోవాల్సిన ఆస్తులు కావన్నారు. అవి దేశాన్ని నిర్మించే సాధనాలని చెప్పారు. లాభాల బాట పట్టిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు అమ్మాలనుకుంటుందని ప్రశ్నించారు. ఐడీబీఐ అమ్మకం, విలువ నిర్ధారణ ప్రక్రియలో పారదర్శకతపై అనేక అనుమానాలు రేతేకిస్తున్నాయన్నారు. దేశంలో జరిగిన భారీ కుంభకోణంగా భవిష్యత్తులో ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు.

ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ ఐడీబీఐ విక్రయ పక్రియను "గ్రేట్ ఇండియన్ రాబరీ" గా అభివర్ణించారు. రూ. 9,500 కోట్ల లాభాలతో నడుస్తున్న ఐడీబీఐ ను విదేశీ సంస్థ " ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్" కు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింది ప్రశ్నించారు. ఐడీబీఐ ప్రయివేటీకరణ వల్ల లక్షల కోట్ల దేశ ప్రజల డిపాజిట్ లు ప్రమాదంలో పడడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు భద్రత కరువై ఉద్యోగాలు కోల్పోతారని చెప్పారు. కెనడా లోఉన్న " ఫెయిర్‌ఫాక్స్" ఒక వేళా దివాళా తిస్తె మన డిపాజిట్ దారుల పరిస్థితి ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "గ్రేట్ ఇండియన్ రాబరీ" లో భాగమే ఈ " ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్" కు ఐడీబీఐ విక్రయమని, బ్యాంకు ఉద్యోగులు, ప్రజలు ఐడీబీఐ విక్రయాన్ని అడ్డుకోవాలన్నారు. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం(ఏఐబిఓఏ) చైర్మన్ వి. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఐడీబీఐ బ్యాంకును విదేశీ సంస్థకు అప్పగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని విమర్శించారు. దేశ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఐడీబీఐని ఏర్పాటు చేశారని, భారీ పరిశ్రమలు, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. బీఈఎఫ్ఐ అధ్యక్షులు వెంకట్రామయ్య మాట్లాడుతూ ఐడీబీఐను ప్రయివేటకరిస్తే ఉద్యోగ భద్రత, వేతనాలు, పెన్షన్ ప్రయోజనాలు, రిజర్వేషన్ల పరిస్థితి ఆందోళనగా మారుతుందని చెప్పారు. ఇందుకు కేంద్రం స్పష్టమైన హామీని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చించకుండానే విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఐడీబీఐ విక్రయ ప్రక్రియను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వమే ఐడీబీఐ ను కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరమ్ అఫ్ బ్యాంకు యూనియన్స్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్, ఏఐటీయూసీసీ రాష్ట్ర కార్యదర్శి భరత్, కాంగ్రెస్ ఎమ్యెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, ఏఐబిఓఏ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు ఐ. హరనాథ్, వైస్ చైర్మన్ కె. మురళి, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ నేతలు ఈ.వి. సోమసుందర్, బి. విఠల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్