Magazines

పండుగొస్తే పల్లెకు పోదాం...

18 నిమిషాల క్రితం

festival
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 4 నిమిషాల చదవడం

మూడేండ్లుగా సాగర్ల రఘు, పల్లవి, భువన నన్ను బతుకమ్మ సంబరాలకు రమ్మని అడుగుతూనే ఉన్నారు. ఈసారి ఎట్టకేలకు వారి ఆహ్వానాన్ని మన్నించి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట, వేంకటరావుపేట గ్రామాలకు వెళ్లాను. అక్కడ బతుకమ్మ సంబరాలు చూశాను. పల్లె ప్రజలతో కలిశాను. దేవయ్య–భూలక్ష్మి, నరసయ్య–అనసూయల ఇళ్లలో ఆత్మీయంగా గడిపాను. కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన.. మూడేండ్లుగా పిలుస్తున్నా రాకుండా ఎంత అనుభూతిని మిస్ అయ్యానో కదా! నిజంగా చెప్పాలంటే, అక్కడ గడిపిన సమయం నా మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. ఎందుకో తెలియదు.. నగరంలో ఎన్నో సౌకర్యాల మధ్య ఉండే నాకు, ఆ పల్లె వాతావరణం ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చింది.

కొంతమందికి పండగంటే ఏ డ్రెస్ వేసుకోవాలన్నదే పెద్ద సమస్య! కొత్త బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్లి, డిస్కౌంట్ చూసి ఆనందపడి, బిల్లు చూసి మళ్లీ ఆలోచనలో పడతాం! ఇంటికి వచ్చాక కొత్త బట్టలతో పది ఫొటోలు దిగుతాం. వాటిని సోషల్ మీడియాలో పెడతాం. లైకులు ఎన్ని వచ్చాయో చూస్తాం. కానీ పక్కింటివారితో పది నిమిషాలు మాట్లాడామా అంటే మాత్రం సమాధానం ఉండదు! ఫొటోల్లో అందరూ కలిసి ఉంటారు కానీ మనసుల్లో మాత్రం ఎవరికి వారే ఒంటరిగా ఉంటున్నామేమో. కోనరావుపేట, వేంకటరావుపేటలో నేను చూసిన బతుకమ్మ సంబరాలు మాత్రం మరో విషయాన్ని గుర్తుచేశాయి. పండుగ అందంగా జరగడానికి ఖరీదైన అలంకరణలు, భారీ ఖర్చులు అవసరం లేదు. మనుషులు కలిసి ఉండాలి. మనసుల్లో ఆప్యాయత ఉండాలి. పిలిస్తే పలికే బంధువులు ఉండాలి. మనిషికి ప్రేమ, అనుబంధం, ఇతరులతో కలిసి ఉన్నాననే భావన ఎంతో ముఖ్యం.

పల్లె మహిళల జీవనశైలి

పల్లె మహిళలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆ గ్రామాల్లో గమనించిన మరో మంచి విషయం మహిళల జీవనశైలి. ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటూ, తమకు అందుబాటులో ఉన్న వనరులతోనే పండుగలను ఆనందంగా జరుపుకోవడం నాకు ఎంతో నచ్చింది. ఉన్నంతలోనే సంతోషాన్ని వెతుక్కోవడం, ఖర్చులను పొదుపుగా నిర్వహించడం, అనవసరమైన ఆర్థిక భారాన్ని తెచ్చుకోకుండా పండుగను పండుగలా జరుపుకోవడం నిజంగా ఆహ్వానించదగిన విషయం. పల్లెల్లో నేను గమనించిన ఈ సరళమైన జీవనశైలి ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది. ఇంట్లో ఉన్న పదార్థాలతో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. బంధువులంతా కలిసి కూర్చొని తినవచ్చు. పాటలు పాడుకోవచ్చు. నవ్వుకోవచ్చు. ఆనందంగా గడపవచ్చు.

లక్షల బడ్జెట్ అవసరమా?

పొదుపంటే ఆనందాన్ని తగ్గించుకోవడం కాదు.. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, ఆనందాన్ని పెంచుకోవడం. మహిళలు కుటుంబ అవసరాలను గుర్తిస్తూ ఖర్చులను సమతుల్యంగా నిర్వహించడం అభినందనీయం. అదే సమయంలో తమ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ప్రణాళిక భార్యాభర్తలిద్దరూ పంచుకోవాలి. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబానికి ఎంతో మేలు. ఆమెకు విశ్రాంతి, పోషకాహారం, వ్యాయామం, తనకంటూ కొంత సమయం కూడా అవసరమే. కుటుంబం కోసం పొదుపు చేయడం మంచిదే కానీ, తన ఆరోగ్యంపై ఖర్చు చేయడాన్ని మాత్రం వృథా ఖర్చుగా భావించకూడదు.

నరసయ్య నేర్పిన జీవిత పాఠం

వేంకటరావుపేటలో నరసయ్యని కలవడం నాకు ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఆయన 12 ఏండ్లు సర్పంచ్‌గా గ్రామానికి నాయకత్వం వహించారు. తాను సంపాదించినదాన్ని సమాజం కోసం కూడా ఖర్చు పెట్టిన ఆయన తీరు స్ఫూర్తిదాయకం. ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది. కొంతమందికి చిన్న పదవి వచ్చినా నడక మారిపోతుంది. ఫోన్ ఎత్తే విధానం మారిపోతుంది. పలకరించే మనుషుల సంఖ్య కూడా మారిపోతుంది! కానీ కొందరు మాత్రం పెద్ద బాధ్యతలు నిర్వహించినా సాధారణంగానే ఉంటారు. పదవిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రజల ప్రేమను సంపాదించుకుంటారు. అందుకే మన పిల్లలకు కేవలం ఆస్తి సంపాదించడం మాత్రమే కాదు, సమాజం పట్ల బాధ్యతగా ఉండటం కూడా నేర్పించాలి. ఎందుకంటే మనం కూడబెట్టిన ఆస్తి మన తర్వాత ఎవరికి చెందుతుందో తెలియదు. కానీ మనం చేసిన మంచి పనులు మాత్రం ఎంతోమంది మనసుల్లో నిలిచిపోతాయి.

పిల్లలు ఎక్కడున్నా..

నాకు అక్కడ కనిపించిన మరో అందమైన విషయం.. పిల్లలు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నా పండుగ వచ్చిందంటే సొంత ఊరికి పరిగెత్తుకుంటూ రావడం. ఉద్యోగం ఒకచోట, చదువు మరోచోట, కుటుంబం ఇంకోచోట ఉండవచ్చు. కానీ పండుగ వచ్చిందంటే మనసు మాత్రం సొంత ఊరి వైపు లాగుతుంది. ఎందుకలా? చిన్నప్పుడు అమ్మ పిలిచిన తీరు, నాన్నతో గడిపిన క్షణాలు, అమ్మమ్మ చేతి వంటలు, తాతయ్య చెప్పిన కథలు, బంధువులతో ఆడుకున్న ఆటలు, ఊరి వీధుల్లో తిరిగిన జ్ఞాపకాలు.. ఇవన్నీ మనసులో బలంగా నిలిచిపోతాయి. ఇలాంటి అనుభవాలను భావోద్వేగ జ్ఞాపకాలతో అనుసంధానించవచ్చు. కొన్ని ప్రదేశాలు, పాటలు, వాసనలు, ఆచారాలు మనకు భద్రతను, అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. విదేశాల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, పండుగకు సొంత ఇంటికి వచ్చి అమ్మ చేతి భోజనం తినడంలో ఉండే ఆనందం వేరే.

మన ఊరికి ఏమిద్దాం..?

పల్లెల్లో ఇప్పటికీ చాలాచోట్ల ఒకరు కనిపిస్తే మరొకరు ఆగి పలకరిస్తారు. ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన వంటకం చేస్తే పక్కింటివారికీ పెడతారు. పండుగ వస్తే అందరూ కలిసి సంబరాలు చేసుకుంటారు. అయితే పల్లెల్లో సమస్యలే లేవని కాదు. ఉపాధి, వైద్యం, విద్య వంటి సవాళ్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకుంటూనే అక్కడి ఆత్మీయతను, సహకారాన్ని కాపాడుకోవాలి. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరగాలి. యువతకు కొత్త ఆలోచనలకు అవకాశం కల్పించాలి. వైద్యం, విద్య అందుబాటులో ఉండాలి. అప్పుడు పల్లెను వదిలి వెళ్లిన పిల్లలు పండుగకే కాదు, తమ ఊరి అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కూడా తిరిగి వస్తారు. పండుగకు వెళ్లి ఫొటోలు దిగడం, పండుగ చేసుకోవడం, తిరిగి నగరానికి వచ్చేయడం మాత్రమే సరిపోదు. పండుగ రోజున పలకరించిన పెద్దలను ఆ తర్వాత కూడా పలకరించాలి. ఊరిలో చదువుకుంటున్న పిల్లలకు మనకు చేతనైన సహాయం చేయాలి. గ్రామంలోని పాఠశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి తోడ్పడాలి. రైతుల కష్టాలను అర్థం చేసుకోవాలి. స్థానిక కళాకారులను ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ పల్లెల్లోనే ఉండాలని చెప్పడం సాధ్యం కాదు. కానీ ఎక్కడ ఉన్నా మన మూలాలతో అనుబంధం కొనసాగించవచ్చు.


- పద్మా కమలాకర్‌








ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్