Magazines

మహిళలను వెంటాడుతున్న లోన్లీనెస్

4 గంటల క్రితం

Loneliness
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 3 నిమిషాల చదవడం

ఈ డిజిటల్ యుగంలో మహిళల్లో అక్షరాస్యత, ఉద్యోగ ఉపాధి అవకాశాలు గతం కంటే మెరుగుపడ్డాయి అనే విషయం వాస్తవమే. అయినప్పటికీ గతంలో ఉన్న ఆనందం, అందరితో కలిసి మెలిసి జీవించడం, కష్టసుఖాలను పంచుకోవడం నేడు కొరవడింది. దీంతో మహిళల్లో ఒంటరితనం అనే మహామ్మారి విస్తృతంగా విజృంభిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఆరు గురు మహిళల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తేలింది. మంచి చదువు, ఉద్యోగం, ఉపాధి, సకల సౌకర్యాలు ఉన్నా చాలా మంది మహిళలు ఒంటరితనం అనే మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. మరో విషయం ఏమిటంటే, గతంలో లేని టెలివిజన్ సౌకర్యాలు, అరచేతిలో ప్రపంచాన్ని చూపుతున్న ఆరు అంగుళాల ‘సెల్ ఫోన్’ అందుబాటులో ఉన్నా, మహిళలు ఒంటరితనంతో బాధపడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో మరెన్నో లోతైన అంశాలను విశ్లేషణాత్మకంగా పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై వైయిక్తిక కుటుంబాలు వచ్చేశాయి. ఉద్యోగ అవసరాల రీత్యా దాదాపు చాలా మంది పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్నారు. చిన్నతనం నుంచే చదువు, మార్కులు గ్రేడులు ర్యాంకులపైనే దృష్టి పెట్టడం వలన సామాజిక సంబంధాలు తెగిపోతున్నాయి. కనీసం కుటుంబ సభ్యులతో కలిసి రోజూ ఒక పది నిమిషాలు మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం అనే సందర్భాలు కరువైనాయి. కనీసం పండుగ పూట కూడా బంధుమిత్రులతో కలిసి ఉండే పరిస్థితి కానరావడం లేదు. ఉద్యోగం, ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వలస వెళ్లడంతో తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మరింత దూరమవుతున్నారు.

మనసు విప్పి మాట్లాడేవారు లేక...

నేడు దొరుకుతున్న ఉద్యోగ అవకాశాల వల్ల ఆర్థికంగా బాగున్నా, సామాజిక బంధాలు దూరంగా ఉండటం వలన మరింత ఒంటరితనం పెరుగుతుంది. దీనికి తోడు నూతన పని ప్రదేశాలు, వర్క్ లోడ్, నూతన స్నేహితులు, ఒత్తిడి పెరగడం, అలసట వంటివి మహిళలకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీతో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు గడుపుతున్నా మరెన్నో నూతన అలవాట్లుకు చేరువవుతున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎంతగా సామాజిక మాధ్యమాలతో సమయం కేటాయించినా మనసు విప్పి కావలసిన వారితో ప్రత్యక్షంగా మాట్లాడలేకపోతున్నామే అనే బాధ వారిలో ఉంటుంది. దీనివల్లనే ఒంటరితనంతో కుమిలిపోతున్నారు. వివాహం తర్వాత కూడా కొంతమంది భార్యాభర్తలు ఉద్యోగ రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. దీనివల్ల కూడా లోన్లీనెస్‌కి లోనవుతున్నారు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల కూడా మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. సహనం, శాంతి, ఓర్పు, ప్రేమ వంటి అంశాలు కనుమరుగు అవుతున్నాయి. దీంతో సమస్యలు జఠిలంగా మారి, ఒంటరితనం అలుముకుంటుంది. కొందరు చెడు వ్యసనాలకు బానిస అవుతున్న పరిస్థితి ఏర్పడింది.

ఏదో ఒక వ్యాపకంతో...

పైన చెప్పిన పలు కారణాలు, పరిస్థితుల వల్ల మహిళలు ఈ కాలంలో ఒంటరితనంతో నలిగిపోతున్నారు. ముఖ్యంగా నేటి కాలంలో ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఏ రకమైన సమస్యలు ఉన్నా కనీసం ఒక గంట వ్యాయామం వంటివి చేయాలి. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవాలి. ఆహార విషయంలో శ్రద్ధ వహించాలి. పరిస్థితులకు అనుగుణంగా మన మనసుకు నచ్చిన వారితో మంచిచెడ్డలు, కష్టసుఖాలను పంచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యానికి ఆటలు ఆడటం మంచిది. అలాగే పుస్తక పఠనం చేయాలి. సంగీతం, నాట్యం, వంటకాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మంచి పాటలు పాడుతూ ఉల్లాసంగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్నదానితో సంతృప్తి చెందాలి. అత్యాశకు లోనవరాదు.


డ్రాయింగ్, పెయింటింగ్ ఇలా ఏదో ఒక వ్యాపకం వల్ల ఒంటరితనం నుంచి బయటపడేందుకు వీలుంటుంది. ఎంత డబ్బు, ఆస్తి, హోదా ఉన్నా శారీరక, మానసిక ఆరోగ్యం లేకపోతే జీవితం జీవచ్ఛవంలా మారుతుందని గ్రహించాలి. ముఖ్యంగా మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. మంచి కథలు, పుస్తకాలు చదవడం ఉత్తమం. ఏది ఏమైనా మానవ సంబంధాలు, సామాజిక బాంధవ్యాలు మనిషిని మహోన్నతులుగా తీర్చిదిద్దుతాయి అనే వాస్తవాన్ని మరువరాదు. మానవుని భావావేశాలు, మానసిక ఆనందం, కష్టసుఖాలు, జయాపజయాలు కావలసిన వారితో పంచుకొనుటలోనే కదా జీవిత మాధుర్యం దాగివుంది. అప్పుడు మాత్రమే ఒంటరితనం పోయి, సమిష్టి భావం వర్ధిల్లుతుంది.


- ఐ.ప్రసాదరావు, 9390509791

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్