బతుకమ్మ తెలంగాణ ప్రజల జీవన విధానంతో, ముఖ్యంగా గ్రామీణ మహిళల సామూహిక జీవనంతో ముడిపడిన ప్రత్యేకమైన పండుగ. పూలను సేకరించడం, వాటిని పేర్చి బతుకమ్మను తయారు చేయడం, చుట్టూ చేరి పాటలు పాడటం, ఆటలు ఆడటం, చివరికి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం ఇవన్నీ ప్రకృతి, వ్యవసాయం, నీరు, స్త్రీల సామాజిక జీవితం పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే అంశాలు. కాలానుగుణంగా ఈ పండుగ రూపం మారుతున్నప్పటికీ, తెలంగాణ సాంస్కృతిక గుర్తింపులో బతుకమ్మకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది.
‘బతుకమ్మ’ అనే పదాన్ని సాధారణంగా బతుకు + అమ్మ’గా అర్థం చేసుకుంటారు. అంటే జీవితాన్ని ప్రసాదించే తల్లిని లేదా జీవనాన్ని కాపాడే అమ్మను సూచించే భావన ఇందులో కనిపిస్తుంది. అయితే బతుకమ్మకు సంబంధించి ప్రజలలో అనేక పురాణ కథలు, జానపద గాథలు, స్థానిక విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే బతుకమ్మను కేవలం ఒక పురాణ కథ ఆధారంగా ఏర్పడిన పండుగగా చూడటం కంటే, తెలంగాణ ప్రాంత ప్రజల ప్రకృతి ఆరాధన, వ్యవసాయ జీవితం, స్థానిక దేవతా సంప్రదాయాలు, స్త్రీల సామూహిక సంస్కృతి కలయికగా చూడాలి.
ప్రకృతితో సంబంధం
తెలంగాణలో వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమయ్యే సమయంలో అడవుల్లో, పొలాల గట్ల మీద అనేక రకాల పూలు విరబూస్తాయి. ముఖ్యంగా తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి పూలు బతుకమ్మలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ పూలలో చాలా వాటికి గ్రామీణ జీవితంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ప్రజలు తమ చుట్టూ సహజంగా లభించే పూలను సేకరించి, వాటిని ఒకదానిపై మరొకటి పేర్చి బతుకమ్మగా తయారు చేసేవారు. అంటే మార్కెట్లో కొనుగోలు చేసి సిద్ధం చేసుకునే వస్తువుగా కాకుండా, తమ చుట్టూ ఉన్న ప్రకృతిలోంచి సమకూర్చుకునే పండుగగా బతుకమ్మకు ఒకప్పుడు ప్రత్యేకమైన స్వభావం ఉండేది. ఇది తెలంగాణ ప్రజలు ప్రకృతి మీద ఆధారపడిన జీవన విధానానికి ఒక ప్రతిబింబం.
వ్యవసాయంతో సంబంధం
తెలంగాణలోని సాంప్రదాయ గ్రామీణ సమాజం వ్యవసాయంపై ఆధారపడేది. వర్షాలు, పంటలు, చెరువులు, కుంటలు, భూమి.. ఇవి ప్రజల జీవనానికి కీలకమైనవి.
బతుకమ్మ పండుగ జరిగే కాలం కూడా వ్యవసాయ పనుల్లో ఒక ముఖ్యమైన దశ. వర్షాకాలం ముగుస్తున్న సమయంలో ప్రకృతి కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. పొలాలు పచ్చగా మారతాయి. చెరువులు, కుంటలు నీటితో నిండుతాయి. ఈ సహజ పరిసరాల మధ్య మహిళలు పూలను సేకరించి బతుకమ్మను తయారు చేసుకుని సామూహికంగా పండుగ జరుపుకునేవారు. అందువల్ల బతుకమ్మలో ప్రకృతి–వ్యవసాయం–నీరు–సామాజిక జీవితం అనే నాలుగు అంశాల అనుసంధానం కనిపిస్తుంది.
మహిళల పాత్ర
తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళలకు తమ భావాలను, అనుభవాలను, ఆనందాన్ని సామూహికంగా వ్యక్తం చేసుకునే అవకాశాలు పరిమితంగా ఉన్న కాలంలో బతుకమ్మ ఒక సామాజిక వేదికగా పనిచేసింది. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఒకచోట చేరి పాటలు పాడటం, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడటం, ఒకరినొకరు పలకరించుకోవడం వంటి సంప్రదాయాలు సామూహిక బంధాలను బలోపేతం చేశాయి. బతుకమ్మ పాటల్లో కేవలం దేవతా స్తుతి మాత్రమే ఉండదు. కుటుంబ సంబంధాలు, గ్రామీణ జీవితం, ప్రకృతి, పంటలు, కష్టాలు, ప్రేమ, విరహం, సామాజిక సంబంధాలు వంటి అనేక అంశాలు కనిపిస్తాయి. ఈ కారణంగా బతుకమ్మ పాటలను తెలంగాణ ప్రజల జానపద మౌఖిక చరిత్రలో ఒక భాగంగా కూడా చూడవచ్చు.
నాటి బతుకమ్మ – నేటి బతుకమ్మ
కాలం మారడంతో బతుకమ్మ రూపంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బతుకమ్మ ప్రధానంగా గ్రామీణ, స్థానిక, కుటుంబ–సామూహిక పండుగగా ఉండేది. పూలను గ్రామ పరిసరాల నుంచే సేకరించేవారు. పండుగ నిర్వహణలో స్థానిక సమాజమే ప్రధాన పాత్ర పోషించేది. ఇప్పుడు బతుకమ్మ తెలంగాణ సరిహద్దులు దాటి దేశ, విదేశాల్లో కూడా నిర్వహించబడుతోంది. బతుకమ్మను స్థానిక జానపద పండుగ నుంచి విస్తృతమైన తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుగా మార్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో బతుకమ్మకు కొత్త రాజకీయ–సాంస్కృతిక ప్రాధాన్యం వచ్చింది. తెలంగాణ ప్రత్యేక గుర్తింపు, భాష, సంస్కృతి, జానపద సంప్రదాయాలను ముందుకు తీసుకువచ్చే సందర్భంలో బతుకమ్మను విస్తృతంగా ఉపయోగించారు. దీంతో బతుకమ్మ ఒక ప్రాంతీయ జానపద పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా కూడా ప్రాచుర్యం పొందింది.
నగరీకరణ ప్రభావం
నగరాల్లో బతుకమ్మను జరుపుకునే విధానం గ్రామీణ పద్ధతికి భిన్నంగా మారింది. మార్కెట్లలో పూలు కొనుగోలు చేయడం, రెడీమేడ్ బతుకమ్మలు అందుబాటులోకి రావడం, అపార్ట్మెంట్లు, కాలనీలు, సంఘాలు కలిసి కార్యక్రమాలు నిర్వహించడం వంటి మార్పులు వచ్చాయి. ఇది ఒకవైపు పండుగను కొత్త తరాలకు చేరువ చేస్తే, మరోవైపు బతుకమ్మకు ఉన్న సహజమైన గ్రామీణ నేపథ్యం కొంత తగ్గిపోవడానికి కారణమవుతోంది. బతుకమ్మ ప్రాచుర్యం పెరగడంతో దాని చుట్టూ వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగాయి. ప్రత్యేక పూల మార్కెట్లు, అలంకరణ సామగ్రి, దుస్తులు, ఆభరణాలు, బతుకమ్మ పాటల ఆల్బమ్లు, కార్యక్రమాలు మొదలైనవి పెద్ద మార్కెట్గా మారాయి. ఇది పండుగకు ఆర్థిక చైతన్యం తీసుకురావడమే కాకుండా, పండుగను వినియోగ సంస్కృతిలో భాగంగా మార్చే ధోరణిని కూడా పెంచింది. ఒకప్పుడు తమ పరిసరాల్లో లభించే పూలతో మహిళలు స్వయంగా బతుకమ్మను తయారు చేసుకునేవారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో బతుకమ్మ తయారీ కూడా ఒక కొనుగోలు సేవగా మారుతోంది. ఈ మార్పు పండుగ స్వరూపంలో వచ్చిన సామాజిక–ఆర్థిక పరిణామాన్ని సూచిస్తుంది.
కొన్ని ప్రశ్నలు
బతుకమ్మకు వచ్చిన విస్తృత ప్రచారం సానుకూల పరిణా మమే అయినప్పటికీ, దాని అసలు సామాజిక మూలాల గురించి కూడా ఆలోచించాలి. పండుగ కేవలం పెద్ద వేదికలు, భారీ అలంకరణలు, పోటీలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం కాకూడదు. బతుకమ్మలోని సామూహికత, స్త్రీల భాగస్వామ్యం, ప్రకృతితో అనుబంధం, స్థానిక పూల ప్రాధాన్యం, నీటి వనరుల విలువ వంటి అంశాలు కూడా కొనసాగాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళలందర్నీ ఒకచోట చేర్చి గడీల దోపిడీకి, లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరుబాట పట్టించటంలో బతుకమ్మ పండుగ ఒక మాద్యమంగా కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు గడిలకే పరిమితమైన బతుకమ్మ పల్లె జనానికి చేరువయింది. పోరాటం పాట అయింది. కానీ ఈనాడు మళ్ళీ కులం పేరుతో దళితుల బతుకమ్మలు దాడులకు గురవుతుండటం మనం చూస్తున్నాము. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాగే బతుకమ్మ పేరుతో జరిగే వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్లాస్టిక్, కృత్రిమ పదార్థాలు, రసాయన రంగులు నీటి వనరులను కలుషితం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.







కామెంట్లు (0)