ఇటీవల చేతిలో జెండా పట్టుకొని పరిగెడుతున్న ఓ అమ్మాయి ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రజల ఓట్లను గల్లంతు చేస్తున్న ఎన్నికల కమిషన్కు, బీజేపీకి వ్యతిరేకంగా ఇటీవల జెన్జీ ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత పెద్ద ఎత్తున అందోళనకు దిగింది. నిరసన కారులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కూడా ‘తిరంగ మహిళా ర్యాలీ’ నిర్వహించింది. కానీ అకస్మాత్తుగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుండి తప్పించుకుని తన గొంతు వినిపించేందుకే ఆ అమ్మాయి తాను పని చేస్తున్న ఎస్ఎఫ్ఐ జెండా పట్టుకొని పరుగులు తీస్తోంది. ఆమే పుళక్కల్ పవిత్ర.
ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ‘తిరంగా మహిళా ర్యాలీ’ జరగాల్సి ఉంది. కానీ ర్యాలీ ప్రారంభం కాకముందే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. సుమారు 25 మంది మహిళలను అదుపులోకి తీసుకోగా వారిలో పుళక్కల్ పవిత్ర ఒకరు. ‘మమ్మల్ని అందరినీ ఒకేసారి అదుపులోకి తీసుకున్నారు. మేము ఎస్ఎఫ్ఐ ర్యాలీ కోసమే ఇక్కడికి వచ్చాము. కానీ అది ప్రారంభం కాకముందే మమ్మల్ని అరెస్టు చేశారు’ అని నిర్బంధ బస్సులో ఉన్నప్పుడు పవిత్ర ఓ ఆంగ్ల పత్రికతో ఫోన్లో మాట్లాడింది.
నిరసన మా ప్రాథమిక హక్కు
‘ఏం జరుగుతోందో నాకు ఏమాత్రం తెలియలేదు. మేము మధ్యాహ్నం ఏకేజీ భవన్ నుంచి మా పాదయాత్రను ప్రారంభించాము. జంతర్ మంతర్ వైపు వెళ్తుండగా, ‘మహిళా పోలీసులను తీసుకురండి’ అని కొందరు పోలీసు అరవడం విన్నాము. దాంతో మేము పరుగెత్తడం మొదలుపెట్టాము. ఆమె తోటి నిరసనకారులను అప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ‘నిరసన తెలపడం మా ప్రాథమిక హక్కు, కానీ ఈరోజు ప్రభుత్వం దాన్ని అణచివేస్తోంది. జూలైలో జరిగిన నిరసనల సమయంలో నేను ఢిల్లీలో లేను. సెలవులకు కేరళ వెళ్లాను. కానీ ఈసారి ఈ ఉద్యమంలో కచ్చితంగా పాల్గొనాలని అనుకున్నాను. ఈ వ్యవస్థ గురించి మనం ఏదైనా చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని హన్స్రాజ్ కళాశాలలో ఆంత్రోపాలజీ మూడవ ఏడాది చదువుతున్న 20 ఏండ్ల పవిత్ర చెప్పింది.
బారికేడ్లతో అడ్డుకున్నారు
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన పవిత్ర, గత రెండేండ్లుగా ఎస్ఎఫ్ఐలో సభ్యురాలిగా ఉంది. ఆమె తల్లి ఒక బ్యాంకు ఉద్యోగి, పాలక్కాడ్లో సీపీఐ(ఎం) సభ్యురాలు. ఆమె తాత ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మంకర (పాలక్కాడ్) మాజీ సర్పంచ్ అయిన కె.వి. చంద్రన్. శనివారం జరిగిన సంఘటనల క్రమాన్ని వివరిస్తూ.. తాను ఎస్ఎఫ్ఐ సభ్యులతో కలిసి ముందు రోజు రాత్రి సుర్జీత్ భవన్లో ఉన్నామని పవిత్ర చెప్పారు. శనివారం ఉదయం 8 గంటలకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు వ్యాపించడంతో విద్యార్థులందరూ ఎ.కె.జి. లాన్లో రక్షణ పొందారు. అక్కడే వారికి అల్పాహారం కోసం బ్రెడ్, టీ ఏర్పాటు చేశారు.
మేము కిందకు దూకేశాము
‘ఉదయం 11.30-12 గంటల ప్రాంతంలో మేము ఎ.కె.జి. భవన్ నుంచి పాదయాత్ర ప్రారంభించాము. కానీ కొద్దిసేపటికే, చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో మేమంతా రోడ్డుపైకి పరుగెత్తి నిరసన ప్రారంభించాం. మేము 200 మందికి పైగా ఉన్నాము. ప్రారంభంలోనే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. ఏ కే జీ భవన్ నుంచి బయటకు వచ్చాక మేము జంతర్ మంతర్ వైపు నడుస్తున్నాం. నేను పరుగెడుతున్న ఫొటోను ఆకాశవాణి భవన్ సమీపంలో తీశారు.. అక్కడే మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే మేము మూడు, నాలుగు బారికేడ్లను దాటవలసి వచ్చింది. పోలీసులు దొరికిన వారిని దొరికినట్టు పట్టుకుంటున్నారు. పోలీసులు మమ్మల్ని చుట్టిముట్టి బలవంతంగా బస్సులోకి ఎక్కించారు. కొంత మందిని విపరీతంగా కొట్టారు. ఆ బస్సులో మేము దాదాపు 25 మంది ఉన్నాము. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు తెలియదు. బస్సు ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో నేను, నాతో పాటు మరో పది మంది కిందకు దూకేశాము’ అని ఆమె అన్నారు.
మగ పోలీసులు చెయ్యి చేసుకున్నారు
ఆదివారం నాడు పవిత్ర మళ్లీ నిరసనలో పాల్గొనడానికి బయటకు వచ్చింది. అయితే పోలీసులు మళ్లీ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ సంయుక్త కార్యదర్శిగా ఉన్న మెహినా ఫాతిమా మాట్లాడుతూ “మేము ర్యాలీ కోసం అక్కడికి వెళ్లాము, మమ్మల్ని దారుణంగా ఈడ్చుకెళ్లారు. నన్ను, మరో మహిళను చెంపదెబ్బలు కొట్టారు” అని అన్నారు. మహిళా నిరసనకారులను మగ పోలీసు అధికారులు చుట్టుముట్టారని ఫాతిమా తెలిపారు. వారిని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు, ఆపై కపాషేరా సరిహద్దుకు తీసుకెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విడుదల చేశారు. ఇలా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా యువత సమాజ మార్పులో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఎన్ని సార్లు అదుపులోకి తీసుకున్నా మళ్లీ వచ్చి ఉద్యమంలో పాల్గొంటూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.






కామెంట్లు (0)