ప్రాచీన కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల చులకన భావం మనకు అడుగడుగునా కనపడుతుంది.. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు కల్పనకై శతాబ్దాలుగా పోరాటం జరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం సామాజిక, ఆర్థిక, మతపరమైన అంశాలు. ఇక మనదేశంలో 19వ శతాబ్దం వరకు మహిళలు గుమ్మం దాటి బయటకు రావడమే పెద్ద ప్రహాసనంగాఉండేది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక స్థాయిలలో జరుగుతున్న ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభంజనం కొనసాగుతున్నది. అయితే ఈ చారిత్రాత్మక విజయం అంత సులభంగా సాధ్యం కాలేదని గుర్తించాలి. ఈ సందర్భంగా మహిళలకు ఓటు హక్కు కోసం జరిగిన పోరాటాన్ని మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మహిళల ఓటు హక్కు గురించి లోతుగా పరిశీలిస్తే మనకంటే ముందు స్వాతంత్య్రం సాధించిన దేశాలు సైతం పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి శతాబ్దాలుగా తాత్సారం చేసాయి. అనేక పోరాటాల ఫలితంగా 1893లో న్యూజిలాండ్, 1902లో ఆస్ట్రేలియా,1906లో ఫిన్లాండ్, 1920లో అమెరికా, 1928లో బ్రిటన్, 1944 లో ఫ్రాన్స్ మహిళలకు ఓటు హక్కు కల్పించాయి. మనదేశంలో మహిళలు ఓటు హక్కు కోసం బ్రిటిష్ కాలం నుండి ఎన్నో పోరాటాలు చేశారు. నేటికి దాదాపు శతాబ్దం పూర్తి అవుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో అన్నింటా ప్రాతినిధ్యం సాకారం కాలేదు.1909 మింటో -మార్లే సంస్కరణలు ద్వారా రాజకీయాల్లో ప్రాతినిధ్యం పురుషులకు మాత్రమే ఉండేది. అదికూడా ఆస్తి, అంతస్తు, విద్య, సామాజిక పరంగా ఉన్నత కులాల వారికి మాత్రమే లభించేది. స్త్రీలకు ఏమాత్రం చోటు లేదు. దీనికి తోడు ఆనాటి సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు మహిళలకు అడ్డుగోడలగా నిలిచాయి. అయితే 20వ శతాబ్దం తొలినాళ్ళలో మనదేశంలో మహిళా ఉద్యమాలు, సంస్థలు ఏర్పడ్డాయి. వీటిలో ‘ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ వంటి సంస్థలు మహిళలకు విద్య, సాంఘిక సంస్కరణల కోసం, ముఖ్యంగా రాజకీయ భాగస్వామ్యం కోసం ఉద్యమించాయి.
అసమానతలపై తిరుగుబాటు
ఈ ఉద్యమంలో డాక్టర్.ముత్తులక్ష్మీ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వైద్యురాలుగా సేవలు అందిస్తూ, మహిళల హక్కులు కోసం పోరుబాట పట్టారు. ఈ క్రమంలో 1917లో మహిళా బృందం బ్రిటిష్ అధికారులను కలిసి తమకు రాజకీయ భాగస్వామ్యం కావాలని వినతిపత్రం అందించాయి. ఇలా ఒక చారిత్రాత్మక ఘట్టానికి పునాది వేసారు. లింగ వివక్ష చూపుతూ మహిళలకు రాజకీయ హక్కులు లేకుండా చేయడం సమంజసం కాదని నిర్మోహమాటంగా చెప్పారు. ఇది కేవలం బ్రిటిష్ ప్రభుత్వానికే కాకుండా భారతదేశంలో ఉన్న సాంఘిక అసమానతలపైనే తిరుగుబాటు చేసినట్లు అయింది. దీంతో 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటరు జాబితాలో మహిళల పేర్లు లిఖించారు. 1921లో మద్రాసు ప్రెసిడెన్సీలో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. తర్వాత బొంబాయిలో మిగిలిన ప్రోవెన్స్లలో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. అయితే విద్య, పన్ను చెల్లింపు, ఆస్తి ఆధారంగా ఓటు హక్కు ఇచ్చారు. దీంతో కేవలం కొందరు మహిళలలకే ఓటు హక్కు లభించింది.
రాజకీయ ఉద్యమంగా...
సరోజినీ నాయుడు, అనిబిసెంట్, హీరాబాయి టాటా, యమ్.టాటా వంటి వారు మహిళలందరికీ ఓటు హక్కు, రాజకీయ భాగస్వామ్యం కావాలని ఉద్యమం నడిపారు. 1919లో బ్రిటన్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వారి వాదనలు వినిపించారు. తర్వాత ఈ ఉద్యమం దేశంలో అప్పటికే జరుగుతున్న స్వాతంత్య్ర పోరాట ఉద్యమానికి దగ్గరయింది. రాజకీయ సభల్లో పాల్గొనడం, రాజకీయ సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది. చివరికి 1931లో కరాచిలో జరిగిన ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ సమావేశంలో విద్య, లింగ, ఆస్తి అంతస్తు ఆధారంగా కాకుండా దేశ ప్రజలందరికీ సమానమైన సార్వజనిక ఓటు హక్కు ఇవ్వాలని తీర్మానించారు. 1935లో వచ్చిన భారత్ ప్రభుత్వ చట్టం కొన్ని మినహాయింపులు ఇచ్చినా, మహిళలందరికీ ఓటు హక్కు కలగజేయలేదు.
ఒక చారిత్రాత్మక ఘట్టం
సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాట అనంతరం 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ప్రజాస్వామ్య దేశంలో లింగ, భాషా, మత, ప్రాంతీయ, ఆస్తి వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోకుండా భారత ప్రజలు అందరికీ సమానమైన సార్వజనిక ఓటు హక్కు ఇవ్వాలని రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించింది. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో 21 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఇచ్చారు. 1951, 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచాయి. దాదాపు ఈ యనభై ఏండ్లుగా భారతదేశ వ్యాప్తంగా, అలాగే వివిధ రాష్ట్రాల్లో అనేక ఎన్నికలు జరిగాయి. కానీ అవిద్య, నిరక్షరాస్యత వివిధ కారణాల వల్ల చాలామంది మహిళలు ఓటును సద్వినియోగం చేసుకోలేకపోవడం బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఓటు ఎలా వేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది.
రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి
రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, సంబంధిత అధికారిక సంస్థలు ఓటు ఎలా వేయాలో ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నిర్భయంగా స్వేచ్ఛగా సేవాభావం కలిగిన వారికి ఓటు వేయాలి. పోరాడి ఓటు సాధించుకున్న మహిళలు ఓటు హక్కు ద్వారా రాజకీయ భాగస్వామ్యంలో మేమేకం కావాలి. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలి. ఓటు హక్కు వినియోగించుకోవడమే కాదు, క్రీయాశీలక రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి దేశ ప్రజలకు సేవలు అందించాలి. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఇదే సందర్భంలో ఇప్పటికీ పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన అమలులోకి తీసుకురావాలి. అప్పుడే ప్రధాని చెబుతున్న వికసిత భారత్ సాధ్యమవుతుంది. అలాగే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయంగా జరుగుతున్న వివిధ ఆర్థిక, రాజకీయ సామాజిక అంశాలను అధ్యయనం చేసి, మహిళలు సాధికారత సాధించాలి. నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి. ముఖ్యంగా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అదే సమయంలో మగవారు కూడా మహిళా అభ్యున్నతికి తోడ్పాటు అందించాలి.
- ఐ.ప్రసాదరావు, 9390509791







కామెంట్లు (0)