ఆర్టీసీ ఎన్నికలకు సమాయత్తం
జోరుగా సంఘాల ప్రచారం
దద్దరిల్లుతున్న డిపోలు
సమస్యలు కొలిక్కి వచ్చేనా !?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీ ఎన్నికలకు సమయం దగ్గర పరడింది. ఇక రెండు రోజులే మిగిలాయి. ఈ నెల తొమ్మిది శుక్రవారం రాష్టవ్యాప్తంగా ఆర్టీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కార్మిక శాఖ ప్రోటోకాల్‌ను పూర్తిచేసింది. ఆ శాఖ సంయుక్త కమిషన్ సునీతా గోపాల్‌దాస్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఆర్టీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది సమస్యల పరిష్కారం గుర్తింపు సంఘం ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఇందులో మరింత కీలకం. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినా, విలీనంతో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ఇటు సంఘాలు, అటు కార్మికుల అంచనగా ఉంది. ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని సర్కారులో విలీనం చేస్తే తమకు ప్రత్యేక అధికారాలు వస్తాయనే భావనతో ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు ఆర్టీసీ స్థలాన్ని కేటాయించిన నేపథ్యంలో అటు ఆర్టీసీ యాజమాన్యం, అటు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్‌కు ప్రత్యేక చట్టం ఉందని అంటూనే విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం అప్పగించడం విమర్శలు వస్తున్నాయి. తర్వాత ఈ సమస్యపైనా గోంతు పెకిలే అవకాశాలు లేకపోలేదని సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతున్నా, సంఘాలు, నాయకులంతా ఎన్నికల పనుల్లో తీరికలేకుండా ఉండటంతో దీనిపై అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదని సంఘాల అభిప్రాయం. ఈనెల తొమ్మిదిన పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఎన్నికల పోలింగ్ చేపట్టనున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే మరో 11 వర్క్‌షాపుల్లో చేపడతారు. మొత్తం 48,327 మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో డ్రైవర్లు 19,420 మంది, కండక్టర్లు 18,110, మెకానిక్‌లు 6,200 మంది, సిబ్బంది 4,597 మంది పాల్గొంటారు. అలాగే విధుల్లో ఉన్న దూరప్రాంత సర్వీసుల సిబ్బందికి ఈనెల 14 , 15 తేదీల్లో ఓటేయడానికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తారు. ఈనెల 17 శనివారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఓట్ల లెక్కింపు చేపడతారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల్లో పోటీచేయడానికి కేవలం 12 సంఘాలు మాత్రమే అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఎన్నికల్లో కీలక అంశాలు
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటికే మూడు ప్రధాన డిమాండ్లను అంగీకరించింది. ఇందులో 11 శాతం పీఆర్సీ ఒకటి. కాగా ఇంకా అమల్లో కి రాలేదు. ఎన్నికల తర్వాతే ఇది అమలయ్యే అవకాశం ఉన్నట్టు ఇటు అధికారులు, అటు సంఘాల నేతలు చెబుతున్నారు. రూ. 8,431 కోట్ల మేర రిటైర్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వంలో విలీనం డిమాండ్ విషయంలో అన్ని సంఘాలు ఒక్కటిగా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కండక్టర్లపై పనిభారం రెట్టింపు అయిందని సంఘాలు చెబుతున్నాయి. ఇందుకు టికెట్‌కు రూ. 3 ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
జోరుగా ప్రచారం
ఎన్నికల ప్రచారాన్ని సంఘాలు భారీస్థాయిలో చేపడుతున్నాయి. సాధారణ ఎన్నికల తరహాల్లో ప్రచారం నడుస్తున్నది. ఆయా సంఘాల నేతలు రాష్ట్రంలోని ప్రతి డిపో, వర్క్‌షాపు వెళ్లి తమ సంఘానికే ఓటేయాలని కోరుతున్నారు. తమను ఎన్నుకుంటే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కార్మికులు, ఉద్యోగులకు హామీనిస్తున్నారు. రాజకీయ ప్రచారం తరహాలో సాగుతున్నది. జోరుగా డిపోల ప్రాంగణాల్లో ఎక్కడికక్కడ విందులు నడుస్తున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని యూనియన్లు ఓట్ల కోసం నానాతిప్పలు పడుతున్నారు. ఓట్లను కొనుగోలు చేసే పరిస్థితులు సైతం ఉత్పన్నమవుతున్నాయి. పోటీ పెరగడంతో ఎలాగైనా గెలవాలనే తపన అన్ని సంఘాల్లోనూ పెరిగింది. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా కీలక నేతలు ఓట్లను అడుగుతున్నారు. ముఖ్యులతో సంప్రదింపులు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)