ఏరియా ఆస్పత్రుల్లో ప్రతినెలా
మెడికల్ బోర్డు సమావేశం :
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి ఆద్వర్యంలో రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సింగరేణి ప్రాంత మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకట స్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి నెలా బోర్డు మీటింగ్ నిర్వహించాలన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞప్తులను ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఆర్డర్లు, ఇతర లీగల్ ప్రాసెస్‌లను 15 రోజుల్లో పూర్తి చేసి అభ్యర్థులకు అందజేయాలన్నారు. కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాల వల్ల విధులకు హాజరుకాక ఉద్యోగాల నుండి తొలగించబడిన కార్మికుల విషయంలో వన్ టైం ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.
విధులు నిర్వహించకుండా సమ్మెకు పిలుపునిచ్చిన లేదా సమ్మెలో పాల్గొన్న అధికారులపై, దానికి నాయకత్వం వహించిన వారిపై నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్యూటీస్ కింద హెచ్చరిక జారీ చేయాలని సూచించారు.
సింగరేణి వద్ద ప్రస్తుతం ఉన్న 1250 ఎకరాల భూమిలో జీవో నెంబర్ 76 ప్రకారంగా అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. బొగ్గు గనులు, ఓవర్ బర్డెన్ డంప్‌ల దుమ్ము వల్ల స్థానికంగా నివాసం ఉంటే ప్రజల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని పలు అధ్యయనాలు తెలుపుతున్నందున, ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సింగరేణి స్థలం కేటాయించాలనీ, బదులుగా ఉపయోగపడని రెవెన్యూ భూమికి సంబంధించి నివేదికను సమర్పించాలని సూచించారు. సమీక్షలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, గండ్ర సత్య నారాయణ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
రామగుండంలో సింగరేణి థర్మల్ కేంద్రం
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)